Andhra Pradesh: అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ టీడీపీలో చేరగానే.. కేసుల నుంచి తప్పించారు!: పురంధేశ్వరి సంచలన ఆరోపణ

  • 12 మంది నిందితుల్ని ప్రభుత్వం కాపాడింది
  • రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారు
  • ఏపీలో 19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులున్నారు

2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని బీజేపీ నేత పురంధేశ్వరి తెలిపారు. ఎన్నికల్లో గెలిచాక మాత్రం ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విమర్శించారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనే పద్ధతి ద్వారా రైతులకు రుణం అందకుండా చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. డ్వాక్రా మహిళలను కూడా నిట్టనిలువునా ముంచిన ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా బీజేపీ చేపట్టిన రిలే దీక్షలో పురంధేశ్వరి మాట్లాడారు.

ఎన్నికల సందర్భంగా రూ.2,500 నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు, ఎన్నికలకు ముందు కేవలం రూ.వెయ్యి ఇవ్వడం ప్రజలను, యువతను మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. నీరు-చెట్టు, ఇసుక, మట్టి, అన్నింటిలో అవినీతి విలయతాండవం చేస్తోందన్నారు. ఏపీలో బాధితుల పక్షాన పోరాడే శక్తిగా బీజేపీ మారాలని అమిత్ షా ఆకాంక్షించారన్నారు. దేశవ్యాప్తంగా 32 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉంటే, వీరీలో 19.38 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

2015, జనవరిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ 8 నెలల పాటు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. చివరికి హైకోర్టు అక్షింతలు వేసిన తర్వాత ప్రభుత్వం ముందుకు కదిలిందని అన్నారు. విదేశీ పర్యటనల పేరిట, సభల పేరిట చంద్రబాబు ప్రజల సొమ్మును చంద్రబాబు దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఈ నిధులతో అగ్రిగోల్డ్ బాధితులను ఎందుకు ఆదుకోలేదని ప్రశ్నించారు.

అగ్రిగోల్డ్ వ్యవహారంలో 18 మందిపై ఎఫ్ఐఆర్ దాఖలైతే ఏపీ పోలీసులు కేవలం ఆరుగురినే అరెస్ట్ చేశారని పురంధేశ్వరి తెలిపారు. ఇంతకుముందు అగ్రిగోల్డ్ సంస్థలో వైస్ చైర్మన్ గా ఉన్న డి.రామారావు వైజాగ్ టీడీపీలో చేరడంతో 12 మంది నిందితులను తప్పించారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులంతా నిరుపేదలనీ, వారిని అదుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News