New Delhi: ఢిల్లీ మాజీ సీఎం మదన్‌లాల్ ఖురానా మృతి
- గత కొంతకాలంగా అస్వస్థత
- ముఖ్యమంత్రి, గవర్నర్‌గా పనిచేసిన ఖురానా
- 2005లో బీజేపీ నుంచి బహిష్కరణ
గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్‌లాల్ ఖురానా (82) శనివారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఖురానా చెస్ట్ ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్నట్టు ఆయన కుమారుడు హరీష్ ఖురానా తెలిపారు.
1936లో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పంజాబ్‌లోని లిల్లాపూర్‌లో ఖురానా జన్మించారు. తర్వాత ఆయన కుటుంబం ఢిల్లీ వచ్చి స్థిరపడింది. చిన్నప్పుడే ఆరెస్సెస్ పట్ల ఆకర్షితులైన ఆయన జన్‌సంఘ్ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు.
వాజ్‌పేయి కేబినెట్లో పార్లమెంటు వ్యవహారాలు, పర్యాటక శాఖమంత్రిగా పనిచేశారు. 1993-96 మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రిగా, 2004లో ఏడు నెలలపాటు రాజస్థాన్ గవర్నర్‌గానూ పనిచేశారు. ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. 2005లో బీజేపీపై విమర్శలు చేసినందుకు గాను పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేసింది. ఖురానా మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. నేడు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ తెలిపారు.