Chandrababu: తెలంగాణలో కొలిక్కి వచ్చిన మహాకూటమి సీట్ల పంపకం... కాంగ్రెస్‌కు 91, టీడీపీకి 15, టీజేఎస్‌కు 8, సీపీఐకి 5 సీట్లు!
- ఢిల్లీలో చంద్రబాబుతో ఉత్తమ్, రమణ భేటీ
- కొన్ని సీట్ల విషయంలో కొనసాగుతున్న ప్రతిష్ఠంభన
- అవసరమైతే త్యాగాలకు సిద్ధపడాలన్న బాబు
తెలంగాణలో మహాకూటమి మధ్య సీట్ల పంపకంలో నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కలిశారు. రాత్రి 10:15 గంటల నుంచి దాదాపు గంటపాటు సమావేశమై సీట్ల గురించి చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ 91, టీజేఎస్ 8, టీడీపీ 15, సీపీఐ 5 సీట్లలో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. గెలుపే ముఖ్యమని, ఆ ప్రాతిపదికనే సీట్ల సర్దుబాటు ఉండాలని భావించిన నేతలు పంతాలకు పోయి గెలుపు అవకాశాన్ని జారవిడుచుకోవద్దన్న నిర్ణయానికి వచ్చారు.
ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చినప్పటికీ ఏయే స్థానాల్లో అన్న విషయంలో స్పష్టత లేదు. గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన ఎల్.బి.నగర్, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్ వంటి సీట్ల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయితే, అక్కడ పార్టీకి ఉన్న అవకాశాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. అవసరమైన త్యాగాలు కూడా తప్పవని ఆయన పేర్కొన్నట్టు సమాచారం.