Jagan: జగన్‌పై దాడి నిందితుడు శ్రీనివాసరావును విచారించేందుకు ప్రశ్నలు సిద్ధం చేసిన పోలీసులు
- శ్రీనివాసరావు కోసం ప్రశ్నలు సిద్ధం చేసిన అధికారులు
- లేఖ రాసిన వారిని విచారించిన పోలీసులు
- దర్యాప్తు పారదర్శకంగా ఉంటుందన్న కమిషనర్
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన శ్రీనివాసరావును విచారించేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, బంధువులతో ఇప్పటికే మాట్లాడిన అధికారులు మరోమారు వారితో మాట్లాడనున్నారు. శ్రీనివాసరావు చెప్పినట్టు లేఖ రాసిన రేవతీపతితోపాటు మరో యువతిని శనివారం విచారించిన పోలీసులు.. శ్రీనివాసరావు వాంగ్మూలంతో వాటిని సరిపోల్చనున్నారు.
ఇక, శ్రీనివాసరావును విచారించేందుకు రంగం సిద్ధం చేసిన అధికారులు అందుకోసం కొన్ని ప్రశ్నలను సిద్ధం చేసుకున్నారు. వాటిలో ముఖ్యంగా ఫోన్ల మార్పిడి, వాటిని కొనేందుకు అవసరమైన డబ్బు ఎలా వచ్చింది? బ్యాంకుల్లో ఉన్న ఖాతాలు, లావాదేవీలు తదితర వాటితోపాటు వేల సంఖ్యలో కాల్స్ ఎందుకు చేశాడు? వారిలో ఎక్కువ సార్లు ఎవరితో మాట్లాడాడు, గత ఆరు నెలల్లో ఎవరెవరిని కలిశాడు? ఎక్కడికి వెళ్లాడు? వాట్సాప్ చాటింగ్‌లు తదితర వాటిపై ప్రశ్నలు అడగనున్నట్టు తెలుస్తోంది.
అలాగే, వాట్సాప్ చాటింగులు, లేఖ రాయడం వెనక ఉద్దేశం, హత్యాయత్నం గురించి ముందుగా ఎవరికైనా చెప్పాడా? ఎయిర్‌పోర్టులో భద్రతా పరమైన లోపాలను ఉపయోగించుకున్న విధానం.. కత్తిని ఎక్కడ కొనుగోలు చేశాడు.. వంటి వాటిపై ప్రశ్నలు సంధించనున్నారు. దర్యాప్తును అత్యంత పారదర్శకంగా నిర్వహించనున్నట్టు కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా తెలిపారు.