YSRCP: శ్రీనివాసరావులో ఇసుమంతైనా భయం కనిపించలేదు: పోలీసులు
- శ్రీనివాసరావులో ఆందోళన లేదన్న పోలీసులు
- జగన్‌పై దాడితో తన అభీష్టం నెరవేరిందన్న నిందితుడు
- క్యాంటీన్ యజమాని హర్షవర్ధన్‌ను విచారించిన సిట్
విశాఖపట్టణం విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్‌పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావులో ఇసుమంతైనా భయం కనిపించడం లేదని, ఆందోళన అసలే లేదని అతడిని విచారించిన పోలీసులు తెలిపారు. గురు, శుక్రవారాల్లో అతడిని విచారించిన పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. అతడిని ఎన్నిసార్లు ప్రశ్నించినా తన వెనక ఎవరూ లేరనే చెబుతున్నాడని పేర్కొన్నారు. దీంతో, మరిన్ని కోణాల్లో అతడిని విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.
తన ఆలోచనలు తనకు ఉన్నాయని, వైసీపీకి లాభం జరుగుతుందనే ఉద్దేశంతోనే జగన్‌పై దాడిచేసినట్టు శ్రీనివాసరావు చెప్పినట్టు తెలుస్తోంది. జగన్‌ను గాయపరచడం ద్వారా తాను అనుకున్నది నెరవేరిందని కూడా చెప్పినట్టు సమాచారం. మరోవైపు, నిందితుడు పనిచేస్తున్న ఎయిర్‌పోర్టు క్యాంటీన్ యజమాని హర్షవర్ధన్‌ను కూడా సిట్ అధికారులు విచారించారు. పలు విషయాలకు సంబంధించి అతడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.
కాగా, సెంట్రల్ జైలు అధికారులు శ్రీనివాసరావును చిత్రావతి బ్యారెక్స్‌లోని ప్రత్యేక సెల్లో ఉంచారు. అతడిని కలిసేందుకు ఎవరినీ అనుమతించబోమని పేర్కొన్న అధికారులు శనివారం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెట్టినట్టు జైలు సూపరింటెండెంట్ ఎస్. రాహుల్ తెలిపారు.