Andhra Pradesh: దాడి ఘటన నేపథ్యంలో.. జగన్ కు మూడంచెల భద్రత కల్పించనున్న ఏపీ పోలీసులు!
- ప్రజలను దగ్గరకు తీసుకోవద్దని సూచన
- సెల్ఫీలు మానేయాలని కోరనున్న పోలీసులు
- పవన్, కన్నాలకు సైతం భద్రత పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై ఇటీవల హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. అధికార టీడీపీ కార్యకర్త శ్రీనివాసరావు ఈ దాడికి పాల్పడ్డాడని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే, జగన్ పై సానుభూతి కోసం వైసీపీ కార్యకర్త అయిన నిందితుడే ఈ దారుణానికి తెగబడ్డాడని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత భద్రతపై పోలీసులు సమీక్ష నిర్వహించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వేలాది మంది ప్రజలతో మమేకం అవుతున్న జగన్ కు మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులు నిర్ణయించారు.
భద్రతను మరింత పటిష్టం చేయడంలో భాగంగా సెక్యూరిటీ సిబ్బందితో పాటు రోప్ పార్టీ సివిల్ పోలీసులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పాదయాత్రలో గతంలోలాగా ప్రతి ఒక్కరినీ దగ్గరకు తీసుకోవడాన్ని జగన్ మానేయాలని సూచించనున్నట్లు వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా సెల్ఫీలకు జగన్ దూరంగా ఉండాలని కోరతామన్నారు. జగన్ తో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణలకు సైతం భద్రతను కట్టుదిట్టం చేయనున్నట్లు పేర్కొన్నారు.