sabitha indrareddy: పూర్తికాలం పాలించలేని సన్నాసులకు ఓటడిగే హక్కు ఎక్కడిది : సబితా ఇంద్రారెడ్డి
- ఎనిమిది నెలల ముందే చేతులెత్తేసిన టీఆర్ఎస్ను తరిమికొట్టండి
- కాంగ్రెస్ను గెలిపించి అధికార పార్టీకి బుద్ధి చెప్పండి
- మహేశ్వరం నియోజకవర్గంలో 65 వేల ఓట్ల మెజార్టీ సాధిస్తాం
‘నమ్ముకున్న ప్రభుత్వానికి ఓటేస్తే తమకేదో మేలు చేస్తారని ప్రజలు ఆశిస్తారు. గత ఎన్నికల్లో ఆ ఆశతోనే టీఆర్ఎస్ను గెలిపించారు. గెలిపించి అధికారం అప్పగిస్తే ఆ పార్టీ నాయకులు ఏం చేశారు? ఎనిమిది నెలల ముందే పాలించలేమని చేతులెత్తేసి ఎన్నికలకు వెళ్లారు. ఇలాంటి సన్నాసులకు మళ్లీ ఓటు అడిగే హక్కు ఎక్కడ ఉంటుంది? రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ను తరిమికొట్టి కాంగ్రెస్ను అఖండ మెజార్టీతో గెలిపించండి’ అంటూ మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగారం, నందుపల్లి, ఏన్గుచెర్వుతండా, పెద్దతండా, గొల్లూరు, హర్షగూడ, పులిమక్త, సిరిగిరిపురం, మంఖాల్ గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో 65 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆమె వెంట పలువురు సీనియర్ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు.