swamy paripoornaanda: నేను ప్రతి విమర్శ చేయను...ఇది నా ప్రతిజ్ఞ : స్వామి పరిపూర్ణానంద
- నన్ను విమర్శించినా పట్టించుకోను
- దూషణలకు దూరంగా ఉంటాను
- సత్యంగా పనిచేస్తా...భగవద్గీత, ధర్మాన్ని అనుసరిస్తా
భవబంధాలకు దూరంగా కాషాయ వస్త్రాలు కట్టుకుని నిన్నమొన్నటి వరకు ధర్మ ప్రచారకునిగా ఉన్న స్వామి పరిపూర్ణానంద హఠాత్తుగా రాజకీయ నాయకుని అవతారం ఎత్తారు. కాషాయ దళంలో చేరారు. ఇకపై రాజకీయాలు చేయాలి, విమర్శించాలి, ప్రతి విమర్శలు చేయాలి. కానీ తాను ఇప్పటికీ ధర్మబద్ధుడినని, భగవద్గీత మార్గాన్ని విడిచిపెట్టనని, దూషణలకు దూరంగా సత్యనిష్టతో పనిచేస్తానని చెబుతున్నారు పరిపూర్ణానంద. ఓ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనను విమర్శించినా ఎటువంటి ప్రతి విమర్శ చేయనని ప్రతిజ్ఞ చేస్తున్నానని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
'రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన తిట్టాలని ఏమీ లేదు. కేసీఆర్ నాకు బంధువు కాదు, విరోధి అంతకంటే కాదు, కాళ్లు మొక్కడాన్ని, నగర బహిష్కరణను సమానంగా స్వీకరించాను. అదే సత్యనిష్టతో పనిచేస్తాను. ‘స్వామిలందు పరిపూర్ణానంద స్వామి వేరు’ అని ఓ శ్లోకంలో చెప్పారు. దాన్ని కాపాడుకుంటాను. నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. కష్టపడి చేయాలని వచ్చా. నాకు పని ఇవ్వండని బీజేపీ చీఫ్ అమిత్ షాను కోరాను. ఎక్కడికి పంపినా వెళ్తానని తెలిపాను. జన్మత: మలయాళీని. అమ్మానాన్న కేరళీయులు. వారు పాలక్కాడ్ నుంచి వలస వచ్చారు. నేను పుట్టింది మాత్రం నెల్లూరులో. వేదాభ్యాసం జరిగింది కర్ణాటకలో. ఆధ్యాత్మిక శిక్షణ తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలో ప్రారంభమైంది.
పాలక్కాడ్‌లో అంతా మాట్లాడేది తమిళమే. అందుకే తమిళం వచ్చు. తెలుగు వచ్చు. హిందీ కూడా మాట్లాడుతాను. మలయాళంలో పట్టుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కేరళ, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా నన్ను ఆదరిస్తారు. నా సూత్రం ధర్మోరక్షతి రక్షిత:. పదవులు కావాలంటే అబద్ధాలు చెప్పాలి. నాకా అవసరం లేదు. అయినా ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులే నా వద్దకు వచ్చి నా కాళ్లకు మొక్కుతుంటే నాకా పదవులతో పని ఏముంది? సన్యాసులు రాజకీయాల్లోకి రాకూడదని ఎక్కడ ఉంది. ప్రజలు మమ్మల్ని గౌరవిస్తున్నారు. ఆ ప్రజలకు మేము సేవ చేయాలనుకోవడం తప్పుకాదు కదా?. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రజలే కోరుకున్నారు. ఆయన సేవలను ఇష్టపడుతున్నారు.
నేను ఆ రాష్ట్రం వెళ్లి స్వయంగా కొందరు ఆటో, రిక్షావాలాలతో మాట్లాడి ఈ విషయం తెలుసుకున్నాను. సన్యాసిగా నా ప్రవచనాలు ప్రజల ఆకలి తీర్చవు. ఆరెస్సెస్ సభ్యులతో కలిసి కొండప్రాంతాలు, బస్తీలకు వెళ్లేవాడిని. నేనేవో చెప్పేవాడిని. నేను చెప్పింది అక్కడి వాళ్లకు పూర్తిగా అర్థమవుతుందని నాకు నమ్మకం లేదు. వారి సమస్యలకు నా మాటలు పరిష్కారం చూపవు. మరి వాళ్లకు నేనేం చేయాలి? వాళ్లకు నేను ఎలా ఉపయోగపడగలనన్న ఆలోచన నుంచి వచ్చిందే రాజకీయ స్వీకారం. నా మూలాలు దెబ్బతినకూడదు. నా లక్ష్యం నెరవేరాలి. అమ్మానాన్నలకు నా మనసులో మాట చెప్పా. నిండు మనసుతో దీవించారు.
మా గురువుగారు మోదీని బాగా అభిమానిస్తారు. మోదీ ప్రధాని కావాలని కోరుకున్న వారిలో ఆయన ఒకరు. అందుకే గురువుగారు నా ఆలోచనను పెద్ద మనసుతో ఆశీర్వదించారు. నన్ను అనుసరించే దగ్గరి వాళ్లందరినీ కూర్చోబెట్టి నా మనసులో మాట చెప్పాను. వారంతా రాజకీయాల్లోకి రావాలని ఆశీర్వదించారు. ప్రజలు సన్యాసులను రాజకీయాల్లో కోరుకుంటున్నారు. ఎందుకంటే మాకు భవబంధాలు లేవు. దందాలు ఉండవు. ఈ అంశాలన్నింటినీ బేరీజు వేసుకున్నాకే రాజకీయ ప్రవేశ నిర్ణయం తీసుకున్నాను' అని పరిపూర్ణానంద ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.