omojaya baba: హైదరాబాద్ శివారులోని ఓమోజయ బాబా ఆశ్రమాల వద్ద ఉద్రిక్తత!
- హిందూవాహిని కార్యకర్తలతోపాటు బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన
- యువతులను నిర్బంధించి మత్తుకు బానిసలు చేస్తున్నారని ఆరోపణలు
- ఓ తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి వాస్తవాలు
మేడ్చల్ జిల్లాలోని ఓమోజయ బాబా ఆశ్రమాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువతులను బంధించి మత్తు మందులకు బానిసలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆశ్రమం ముందు హిందూవాహిని కార్యకర్తలతోపాటు బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. యువతులను బంధించి వేధింపులకు గురిచేస్తున్నారని, తల్లిదండ్రులు వచ్చినా చూపించడం లేదంటూ కాప్రా వంపుగూడ, కీసరం మండలం కరీంగూడ ప్రాంతాల్లో ఉన్న ఆశ్రమాల ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హైదరాబాద్ పరిసరాల్లో నాలుగు చోట్ల ఓమోజయ బాబా ఆశ్రమాలున్నాయి. ఆశ్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, బాబా ప్రవచనాలకు ఆకర్షితులై చాలా మంది యువతులు ఆశ్రమంలో చేరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం నిర్మల్‌కు చెందిన బీటెక్ విద్యార్థి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆమె తల్లి ఆశ్రమంలో వదిలి వెళ్లింది. ఆదివారం కూతుర్ని చూసేందుకు వచ్చిన ఆమెను నిర్వాహకులు ఆశ్రమంలోకి అనుమతించ లేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి మత్తులో పడేస్తున్నారని మరికొందరు తల్లిదండ్రులు కూడా ఆరోపించడంతో వివాదం ఆందోళన వరకు వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కుషాయిగూడ ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు ఆశ్రమాన్ని చుట్టుముట్టారు. అయితే భక్తులు పోలీసులను కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ ఏడుగురు యువతులకు పోలీసులు విముక్తి కలిగించారు.