gvl: జగన్ చనిపోతే లాభం ఎవరికి?: జీవీఎల్
- కేంద్ర సంస్థల దర్యాప్తుకు టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు?
- జగన్ ను చంపడానికే దాడి చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు
- క్రిమినల్ ఏ పార్టీకి చెందినవాడు అనేది ముఖ్యం కాదు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చివరకు కోతలరాయుడిగా, అబద్ధాల బాబుగా చరిత్రకు ఎక్కుతారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు అనేక సందర్భాల్లో యూటర్న్ తీసుకున్నారని... ఆయన 'యూటర్న్ చీఫ్ మినిస్టర్' అనే విషయం అందరికీ తెలుసని అన్నారు. వైసీపీ అధినేత జగన్ పై దాడి జరిగిన రాత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ఎయిర్ పోర్టులో జరిగింది కాబట్టి తమకు సంబంధం లేదని... కేంద్రం ఎంక్వైరీ చేసుకోవచ్చని చెప్పారని తెలిపారు. ఇప్పుడు కేంద్ర సంస్థ ద్వారా విచారణ జరుగుతుందేమోనని టీడీపీ నేతలు భయపడుతున్నారని అన్నారు. టీడీపీ నేత కనకమేడల మాట్లాడుతూ, కేంద్ర సంస్థతో దర్యాప్తును తాము కోరలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు.
దాడికి సంబంధించి చంద్రబాబు చెప్పినదానికి, మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ రిపోర్ట్ లో తెలిపిన దానికి పొంతన లేకుండా ఉందని జీవీఎల్ అన్నారు. కత్తితో దాడి చేయడం వల్ల జగన్ కు గాయమయిందని విచారణలో తేలిందని రిపోర్టులో పేర్కొన్నారని తెలిపారు. జగన్ ను చంపడానికి దాడి చేశారని రిపోర్టులో చెప్పారని అన్నారు. కానీ, ఘటనకు సంబంధించి చంద్రబాబు అన్నీ రాజకీయ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఇన్వెస్టిగేటివ్ అధికారి వద్ద లేని సమాచారం మీ దగ్గర ఏం ఉందని చంద్రబాబును ప్రశ్నించారు. విచారణను తప్పుదోవ పట్టించాలని ఎందుకు యత్నించారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్ పై దాడి చేసింది ఆయన అభిమానులే అని ఒక పార్టీ, అధికార పక్షమే ఈ దాడి చేయించిందని మరొక పార్టీ ఆరోపణలు చేసుకుంటున్నాయని... క్రిమినల్ ఏ పార్టీకి చెందినవాడు అనే విషయం ముఖ్యం కాదని జీవీఎల్ అన్నారు. దాడి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ప్రేరేపించిన వ్యక్తులు ఎవరు? ఈ దాడి వల్ల ఉపయోగం ఎవరికి? అనేదే ముఖ్యమని చెప్పారు. ఒకవేళ జగన్ చనిపోతే లాభం ఎవరికి? అని ప్రశ్నించారు. ఈ కోణంలో విచారణ జరగాలని చెప్పారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే సరిపోయేదని... అనవసరంగా రాద్ధాంతం చేశారని మండిపడ్డారు.
టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు అంటున్నారని... అక్రమార్కులపై దాడులు చేస్తే తప్పేముందని జీవీఎల్ అన్నారు. అన్ని పార్టీల నేతలపై విచారణ జరిపించాలని తాను చెప్పానని... దీనికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేస్తే, అన్ని పార్టీల్లోని దొంగలు బయటపడతారని చెప్పారు.