team india: చెలరేగిన రోహిత్ శర్మ.. వన్డేల్లో 21వ సెంచరీ నమోదు.. రాయుడు హాఫ్ సెంచరీ
- వెస్టిండీస్ తో నాలుగో వన్డే
- దూకుడుగా ఆడుతున్న రోహిత్, రాయుడు
- నిరాశపరిచిన కోహ్లీ
ముంబైలో వెస్టిండీస్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి సత్తా చాటి వన్డేల్లో 21వ సెంచరీని నమోదు చేశాడు. 98 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో శతకాన్ని బాదాడు. అంతకు ముందు టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు రోహిత్, ధావన్ లు 71 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 38 పరుగుల వ్యక్తి గత స్కోరు (40 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వద్ద పాల్ బౌలింగ్ లో కీరన్ పావెల్ కు క్యాచ్ ఇచ్చి ధావన్ పెవిలియన్ చేరాడు.
అనంతరం కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ఈ సిరీస్ లో వరుసగా మూడు సెంచరీలు చేసిన కోహ్లీ ఈ మ్యాచ్ లో నిరాశ పరిచాడు. 2 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేసిన కోహ్లీ... రోచ్ బౌలింగ్ లో హోప్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాయుడు ధాటిగా ఆడుతూ అర్ధశతకాన్ని (51 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్సర్) సాధించాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 223 పరుగులు. రోహిత్ 110 పరుగులు, రాయుడు 50 పరుగులతో ఆడుతున్నారు.