jagan: జగన్ పై దాడి కేసుపై కేంద్ర సంస్థల దర్యాప్తు కోరడం తగదు: టీడీపీ ఎంపీ కనకమేడల
- రాష్ట్ర పోలీసులతో దర్యాప్తు చేయిస్తే కుట్ర బయటకొస్తుంది
- అందుకే, వైసీపీ నాయకులు భయపడుతున్నారు
- రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కేంద్రం చూస్తోంది
జగన్ పై దాడి కేసుపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని ఆ పార్టీ నేతలు కోరడం తగదని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసుపై రాష్ట్ర పోలీసులతో దర్యాప్తు చేయిస్తే వారి కుట్ర బయటపడుతుందని వైసీపీ నేతలు భయపడుతున్నారని, అందుకే, కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని కోరుతున్నారని విమర్శించారు. ఇలాంటి కోడి కత్తి కేసుల్లో కేంద్ర జోక్యం చేసుకుని, వైసీపీతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చూస్తోందని, దీనిపై ఐదు కోట్ల మంది ప్రజలు తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
టీడీపీకి చెందిన మరోనేత కంభంపాటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ, ఏపీలో శాంతి భద్రతల సమస్య సృష్టించి ఇక్కడికి పెట్టుబడిదారులు రాకుండా చూసేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. టీడీపీపైనా, తమ నాయకుడిపైనా కోపం ఉంటే తమపై వ్యాఖ్యలు చేయాలి తప్ప, రాష్ట్రాభివృద్ధిని, ఇమేజ్ దెబ్బతినే విధంగా రాజకీయాలు చేస్తున్న వైసీపీ నాయకులను ప్రజలు క్షమించరని హెచ్చరించారు.