Jammu Kashmir: మారువేషంలో వెళ్లాడు.. అయినా 'ఉగ్ర'తూటాలకు బలయ్యాడు!
- ఉగ్రవాదులను ఏమార్చాలనుకున్న పోలీస్ ఆఫీసర్
- సొంత వాహనంలో ప్రయాణం
- అయినా ఉగ్రవాదులు పట్టేసుకున్నారు
తన కుటుంబాన్ని కళ్లారా చూడాలన్న కోరికతో ఓ ఎస్సై వేషం మార్చుకున్నాడు. ప్రభుత్వ వాహనంలో కాకుండా తన సొంత వాహనంలో స్వస్థలానికి బయలుదేరాడు. అయినా ఉగ్రవాదులకు ఎలా తెలిసిందో కానీ వెంటాడి మరీ అడ్డుకుని కాల్పులు జరిపి హతమార్చారు.
ఆ వివరాల్లోకి వెళితే, జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఇంతియాజ్ అహ్మద్ మీర్ కుల్గాం పట్టణంలో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ ప్రాంతం ఉగ్రవాదులకు నెలవు కావడంతో స్వస్థలానికి వెళ్లలేని పరిస్థితి. అయినా తన తల్లిదండ్రులను ఎలాగైనా కలవాలని చెప్పి మారు వేషం ధరించాడు. ‘ఇక ఉగ్రవాదులు నన్ను గుర్తించలేరు’ అని సహోద్యోగులకు చెప్పి తన సొంత వాహనంలో స్వస్థలానికి బయలు దేరాడు.
అయినా ఉగ్రవాదులు కనుక్కున్నారు. ఇంతియాజ్ వాహనాన్ని వెంటాడి పుల్వామా జిల్లాలోని వాహిబుగ్ ప్రాంతంతో అడ్డుకున్నారు. ఆయనను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి హతమార్చారు. ‘ఎస్సై ఇంతియాజ్‌ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. పుల్వామాలో ఉగ్రవాదులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ దారుణమైన ఘటనను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంతియాజ్ కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని కశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇంతియాజ్ భౌతిక కాయాన్ని అతని స్వస్థలానికి తరలించారు.