Tulasi Reddy: ఏపీ ప్రజలపై నమ్మకం లేని జగన్ ఆంధ్రాలో ఎందుకు పోటీ చేస్తున్నట్టో?: తులసి రెడ్డి
- తెలంగాణలోనో, మరో రాష్ట్రంలోనో పోటీ చేయాలి
- కాంగ్రెస్‌ది గాంధీ సిద్ధాంతం
- హనుమంతుడి ముందు కుప్పిగంతులు వద్దు
ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ ఉపాధ్యక్షుడు నర్రెడ్డి తులసిరెడ్డి ఫైరయ్యారు. ఆంధ్రులపైనా, ఏపీ పోలీసు వ్యవస్థపైనా నమ్మకం లేని జగన్ ఏపీకి ముఖ్యమంత్రి కావాలనుకోవడం సిగ్గుచేటన్నారు. ఏపీ ప్రజలపై నమ్మకం లేని జగన్ తెలంగాణలోనో, మరో రాష్ట్రంలోనో పోటీ చేయాలని సూచించారు.
జగన్‌కు ఏ రకంగానూ ఏపీలో పోటీ చేసే అర్హత లేదన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పైనా తులసిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌కు సిద్ధాంతం లేదన్న అమిత్‌షాపై నిప్పులు చెరిగారు. అసలాయనకు చరిత్ర గురించి తెలుసా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ది గాంధీ సిద్ధాంతమని, కానీ బీజేపీది మాత్రం గాడ్సే సిద్ధాంతమని విమర్శించారు. హనుమంతుడి ముందు కుప్పిగంతులు వద్దని హితవు పలికారు.
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత దేశ నిర్మాణంలో కాంగ్రెస్ ప్రముఖ పాత్ర పోషించిందని తులసిరెడ్డి అన్నారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ప్రాణ త్యాగం చేశారన్నారు. మోదీ సర్కారు వల్ల అచ్చేదిన్ రాలేదు కానీ, ‘చచ్చేదిన్’ వచ్చాయని సమాన్యులు, మధ్య తరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.