India: వరుసగా 13వ రోజు కూడా... తగ్గిన 'పెట్రో' ధరలు!
- ఆరు వారాల కనిష్ఠానికి ఇంధన ధరలు
- పెట్రోలుపై 20 పైసల ధర తగ్గింపు
- డీజిల్ పై 7 పైసల ధర తగ్గింపు
ఇంటర్నేషనల్ మార్కెట్లో చమురు ధరలు తగ్గుతున్న వేళ, ఇంధన ధరలు ఆరు వారాల కనిష్ఠానికి చేరగా, వరుసగా 13వ రోజూ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. మంగళవారం నాడు పెట్రోలుపై 20 పైసలు, డీజిల్ పై 7 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వెల్లడించాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 79.55కు, డీజిల్ ధర రూ. 73.78కు తగ్గింది.
ఇదే సమయంలో ముంబైలో పెట్రోలు ధర. 85.04కు, డీజిల్ ధర రూ. 77.32గా ఉంది. ఇక కోల్ కతాలో లీటరు పెట్రోలు ధర రూ. 81.63కు, డీజిల్ ధర రూ . 75.70కు చేరగా, చెన్నైలో రూ. 82.86కు పెట్రోలు ధర, రూ. 78.08కి డీజిల్ ధర తగ్గింది. హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 84.33గా, డీజిల్ ధర రూ.80.25గా ఉండగా, విజయవాడలో పెట్రోలు ధర రూ. 83.47, డీజిల్ ధర రూ. 79కి తగ్గింది. సమీప భవిష్యత్తులో ఈ ధరలు మరింతగా దిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.