Rahul Gandhi: రాహుల్ గాంధీపై పరువునష్టం దావా వేస్తా: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
- వ్యాపమ్, పనామా పేపర్ల కుంభకోణాల్లో శివరాజ్, ఆయన కుమారుడు ఉన్నారన్న రాహుల్
- బీజేపీ వ్యక్తులను చిన్నచూపు చూడటం కాంగ్రెస్ కు అలవాటేనన్న శివరాజ్
- మళ్లీ అధికారంలోకి రాలేమన్న నిరాశలో రాహుల్ ఉన్నారు
తనపై, తన కుటుంబసభ్యులపై తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై పరువునష్టం దావా వేస్తానని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వ్యాపమ్, పనామా పేపర్లతో పాటు పలు కుంభకోణాల్లో శివరాజ్ సింగ్, ఆయన కుమారుడు కార్తికేయలు ఉన్నారంటూ నిన్న రాహుల్ ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలపై శివరాజ్ సింగ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... 'మిస్టర్ రాహుల్ గాంధీ... వ్యాపమ్ నుంచి పనామా పేపర్ల వరకు నాపై, నా కుటుంబసభ్యులపై ఆరోపణలు చేశారు. తప్పుడు ఆరోపణలు చేసిన మీపై పరువునష్టం దావా వేస్తున్నాను. చట్టం తన పని తాను చేసుకుపోతుంది' అని అన్నారు.
బీజేపీకి చెందిన వ్యక్తులను చిన్న చూపు చూడటం కాంగ్రెస్ కు అలవాటేనని శివరాజ్ విమర్శించారు. ప్రధాని మోదీని మృత్యు వ్యాపారి, నీచుడు, తేలు అని కాంగ్రెస్ సంబోధిస్తుందని మండిపడ్డారు. తనను పనికిమాలినవాడు అని అంటుందని దుయ్యబట్టారు. మళ్లీ అధికారంలోకి రాలేమన్న నిరాశలో రాహుల్ ఉన్నారని... ఈ నిరాశ ఆయనను మానసికంగా దెబ్బతీస్తోందని చెప్పారు.