Samsung: రూ. 1600కే శాంసంగ్ జే2... చూశాక లబోదిబో!
- అనంతపురం జిల్లాలో ఘటన
- తక్కువ ధరకే ఫోన్ అంటూ మోసపు కాల్
- స్వీట్ బాక్స్ ను చూసి అవాక్కైన చేనేత కార్మికుడు
అతి తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ వస్తోందని సంబరపడ్డ ఆ యువకుడు అవాక్కయ్యాడు. శాంసంగ్ జే-2 ఫోన్ వచ్చిందనుకుని పార్శిల్ బాక్స్ విప్పి చూడగా, అందులో స్వీట్ బాక్స్, హనుమాన్ చాలీసా యంత్రం ఉన్నాయి. దీంతో లబోదిబోమన్నాడా యువకుడు. ఈ ఘటన అనంతపురం జిల్లా సోమందేపల్లిలో జరిగింది. ఇక్కడ నివాసం ఉంటున్న చేనేత కార్మికుడు నరేష్ కు ఎస్ఎస్కే అనే కంపెనీ నుంచి ఫోన్ (96066 71368) వచ్చింది. ఆఫర్ లో భాగంగా ఖరీదైన ఫోన్ ను రూ. 1,600కే ఇస్తున్నట్టు చెప్పడంతో మరో ఆలోచన లేకుండా ఆర్డర్ చేశాడు నరేష్. సోమవారం నాడు పోస్టుమ్యాన్ పార్సిల్ తీసుకురాగా రూ. 1,600 చెల్లించి, దాన్ని తీసుకుని ఇంటికి వెళ్లి పార్సిల్ ను తెరచి చూశాడు. అందులో ఫోన్ లేదు సరికదా, ఓ స్వీట్ బాక్స్, హనుమాన్ చాలీసా యంత్రం ఉన్నాయి. తనను కంపెనీ వారు మోసం చేశారని బాధితుడు ఆరోపించాడు.