Hyderabad: సతీశ్ సానాకు రక్షణ కల్పించండి.. హైదరాబాద్ పోలీసులకు సుప్రీం ఆదేశం!
- సతీశ్ ఫిర్యాదుతోనే అస్తానాపై కేసు
- విచారణ ఆపాలని కోరిన సతీశ్
- నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం
సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్తానా అవినీతి కేసులో వ్యాపారవేత్త సతీశ్ సానా కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు విచారణ నిలిపివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను ఈ రోజు అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రస్తుతం ఈ కేసులో విచారణను నిలిపివేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే తనను అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు జారీచేయాలన్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.
సతీశ్ సానా ఇచ్చిన ఫిర్యాదు మేరకే రాకేశ్ ఆస్తానాపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో విచారణ ముగిసేవరకూ తనకు రక్షణ కల్పించాలనీ, తనకు ప్రాణహాని ఉందని సతీశ్ సుప్రీంకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం.. సతీశ్ కు తగిన రక్షణ కల్పించాలని హైదరాబాద్ పోలీసులను ఆదేశించింది. ఈ కేసు విచారణలో సహకరించాలని సతీశ్ సానాకు సుప్రీంకోర్టు సూచించింది.