Shivraj Singh Chouhan: పరువునష్టం దావా వేస్తానన్న శివరాజ్ సింగ్ చౌహాన్.. మరోసారి సెటైర్ వేసిన రాహుల్ గాంధీ
- బీజేపీలో ఎన్నో కుంభకోణాలు, అంతులేని అవినీతి ఉంది
- అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా
- పనామా కుంభకోణంలో ఆయన లేరు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన కుమారుడు పనామా పేపర్లు, వ్యాపమ్ కుంభకోణాల్లో ఉన్నారంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై శివరాజ్ ఘాటుగా స్పందించారు. నిరాధార ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీపై పరువునష్టం దావా వేస్తున్నానని తెలిపారు.
ఈ నేపథ్యంలో, శివరాజ్ సింగ్ చౌహాన్ పై రాహుల్ మరోసారి సెటైర్ వేశారు. 'బీజేపీలో ఎన్నో కుంభకోణాలు, అంతులేని అవినీతి ఉన్నాయి. అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పనామా కుంభకోణంలో లేరు. ఈ-టెండరింగ్, వ్యాపమ్ కుంభకోణాల్లో మాత్రమే ఉన్నారు' అంటూ దెప్పి పొడిచారు.
నవంబర్ 28న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీని ఎలాగైనా మట్టికరిపించాలనే కృత నిశ్చయంతో కాంగ్రెస్ నేతలు పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే, ముఖ్యమంత్రి శివరాజ్ పై రాహుల్ ఘాటైన విమర్శలు సంధిస్తున్నారు.