Telangana: కేసీఆర్ లో పేరులో కే-అంటే కాలువలు సీ-అంటే చెరువులు ఆర్- అంటే రిజర్వాయర్లు!: మంత్రి కేటీఆర్
- ప్రత్యేక తెలంగాణను కాంగ్రెస్ నేతలు తాకట్టు పెట్టారు
- పదవులను పట్టుకుని గద్దల్లా వేలాడారు
- మా బాసులు ఢిల్లీలో లేరు గల్లీలో ఉన్నారు
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆత్మగౌరవం లేదనీ, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో పదవులను గద్దల్లా పట్టుకుని వేలాడారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఆంధ్రా నేతలకు తాకట్టు పెట్టిన చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ నేతలదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ నేతలు అంత సులభంగా ఇవ్వలేదనీ, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే వీపు చింతపండు అవుతుందని ప్రజలు హెచ్చరించడంతో తెలంగాణ వచ్చిందని వెల్లడించారు. ఈ రోజు కామారెడ్డి లో జరిగిన టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు.
కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదనీ, కే-అంటే కాలువలు, సీ-అంటే చెరువులు, ఆర్-అంటే రిజర్వాయర్లని మంత్రి కొత్త నిర్వచనం ఇచ్చారు. కేసీఆర్ మోదీని కలవడానికి ఢిల్లీకి వెళ్లారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలీ చెబుతున్నారనీ, ఇప్పుడు మోదీ జపాన్ లో ఉన్న విషయం కూడా తెలియని తెలివితక్కువ దద్దమ్మలు కాంగ్రెస్ నేతలని కేటీఆర్ విమర్శించారు. మోదీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు ఎవరైనా సరే తాము భయపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలకు ఢిల్లీలో బాసులు ఉన్నారనీ, తమకు మాత్రం తెలంగాణ గల్లీల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఎన్నికల సంఘం బాగా ఆలోచించే ఎన్నికల గుర్తులు కేటాయిస్తుందని కేటీఆర్ అన్నారు. గత 71 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశానికి చెయ్యిచ్చిందనీ, అందుకే ఆ పార్టీకి ‘చెయ్యి’ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించిందని ఎద్దేవా చేశారు. బీజేపీ ఇన్నేళ్లలో జనాల చెవుల్లో పువ్వులు పెట్టడం తప్ప చేసిందేమీ లేదని చమత్కరించారు. కారు జోరుగా సాగిపోవాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ ను కారు గుర్తును ఈసీ కేటాయించిందని తెలిపారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత ఏనుగు రవీంద్ర రెడ్డికి గత ఎన్నికల్లో 39 వేల ఓట్లు వచ్చాయనీ, ఈసారి 50 వేల మెజారిటీ వచ్చే దిశగా టీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేయాలని కోరారు. కేంద్రంలో త్వరలో ఏర్పడబోయే ప్రభుత్వంలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందనీ, రాష్ట్రానికి కావాల్సిన కీలక ప్రాజెక్టులను అప్పుడు తెచ్చుకుంటామని వెల్లడించారు.