CM Ramesh: బీజేపీ అధికారంలో ఉంటే న్యాయం జరుగుతుందనే ఇదంతా చేశాం: సీఎం రమేష్
- విభజన సమయంలో బీజేపీ మాటలను నమ్మాం
- ఏపీని అభివృద్ధి చేస్తారని భావించాం
- అందుకే బీజేపీని భుజాన ఎత్తుకున్నాం
బీజేపీ అధికారంలో ఉంటే ఏపీకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే నాడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. మంగళవారం కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో జరిగిన ధర్మపోరాట సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందో ఆ సమయంలో రాజ్యసభలో ‘ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతోంది. 10 సంవత్సరాలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ బిల్లులో ఇవన్నీ పెట్టాలి. అలా చేస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుంది’ అని నాడు బీజేపీ నాయకులు చెబితే వీరేదో మన ఏపీకి న్యాయం చేస్తారని ఆ తదుపరి వచ్చిన ఎన్నికల్లో బీజేపీతో కలిశామని అన్నారు .
ఎన్నికల ప్రచారానికి వచ్చినపుడు నరేంద్రమోదీ తిరుపతి, నెల్లూరు, గుంటూరు, వైజాగ్ల్లో ‘చంద్రబాబుతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తాం. మీకు స్కామాంధ్రప్రదేశ్ కావాలా? స్కీములొచ్చే ఆంధ్రప్రదేశ్ కావాలా’ అని మాట్లాడారు. అనంతరం మోదీ ఏం చేశారు? ఆ సమయంలో చంద్రబాబు గారు పోలవరం ముంపు మండలాలు ఏడు మాకు ఇవ్వకుంటే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను అంటే వెంటనే ఆ బిల్లు తీసుకొచ్చి చట్టం చేశారు. దీంతో మన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తారని వీరిని భుజాన ఎత్తుకున్నాం. పార్లమెంటులో బీజేపీ పెట్టిన ప్రతి బిల్లూ పాస్ చేసుకుంటూ వచ్చాం. బీజేపీ అధికారంలో ఉంటే ఏపీకి న్యాయం జరుగుతుందనే ఇదంతా చేశాం అని తెలిపారు.