Chandrababu: జగన్ దాసోహమంటూ బీజేపీ కాళ్లపై పడ్డాకే వారికి ధైర్యమొచ్చింది: సీఎం రమేష్
- అన్నీ పార్టీలు ఏపీకి న్యాయం చేయాలని కోరాయి
- చంద్రబాబు పెరిగితే మోదీకి ఇబ్బంది
- ఎలాగైనా అణచి వేయాలని పగబట్టారు
- కేసులకు భయపడి జగన్ ఏది చెప్తే అది చేస్తాడు
జగన్మోహన్ రెడ్డి నక్కలాగా కేసులకు భయపడి వారికి దాసోహం అంటూ కాళ్లపై పడ్డాకే బీజేపీకి ధైర్యమొచ్చిందని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. మంగళవారం కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో జరిగిన ధర్మపోరాట సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మాతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన అనంతరం బీజేపీ మాట మార్చింది. విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేయాలని కోరితే ఇప్పుడు చేస్తాం, అప్పుడు చేస్తామంటూ టైమ్ పాస్ చేసుకుంటూ పోయారు. అయినా మన ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వదలకుండా 29 సార్లు ఢిల్లీకి వచ్చి ఎక్కని గడప.. దిగని గడప లేదు. ప్రధానిని, ఫైనాన్స్ మంత్రిని, హోంమంత్రిని ప్రతి ఒక్కరినీ కలిసి ఏపీకి న్యాయం చేయాలని చంద్రబాబు కోరారు.
అప్పటి నుంచి మభ్యపెడుతూనే ఉన్నారు కానీ న్యాయం చేయలేదు. ఇలా అయితే మన ఆంధ్రప్రదేశ్ ఇబ్బంది పడుతుందని వాళ్లింక న్యాయం చేయరు అని నిర్థారించుకున్నాక మంత్రులు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి వైదొలగడంతో మనపై పగబట్టారు. ఇప్పటిదాకా మోదీని పార్లమెంటులో ఎదిరించిన వారెవరూ లేరు. ఒక్క టీడీపీ భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుకుని అవిశ్వాస తీర్మానం పెట్టి వారిని నిలదీసింది. అన్ని పార్టీలు ఏపీకి న్యాయం చేయాలని కోరినా పట్టించుకోలేదు. దీనికంతటికీ కారణం ఏంటంటే.. చంద్రబాబు పెరిగితే మోదీకి ఇబ్బంది. భారతదేశంలో ఆయన ఒక్కరే గొప్ప లీడర్ కాబట్టి ఆయనను ఏవిధంగానైనా అణచి వేయాలని పగబట్టారు.
ఏదో కడప జిల్లా అంటే పౌరుషమైన జిల్లా అనుకున్నాం కానీ ఇక్కడి జగన్మోహన్ రెడ్డి నక్క లాగా కేసులకు భయపడి వారికి దాసోహం అంటూ కాళ్లపై పడ్డాకే బీజేపీకి ధైర్యమొచ్చింది. టీడీపీ లేకుంటే మనకు వైసీపీ ఉంది. జగన్ అయితే కేసులకు భయపడి మనం ఏది చెప్తే అది చేస్తాడు అని ఆయనను దగ్గరకు తీశారు. అప్పటి నుంచి మనకు ఒక్కరు కూడా సాయం చేయకుండా వాళ్లు చేస్తున్నారు. ఎప్పుడైతే మనం అవిశ్వాస తీర్మానం పెట్టామో, ఎప్పుడైతే మోదీని ఎదురించామో అప్పటి నుంచి భారతదేశంలో వారి గ్రాఫ్ పడిపోతూ వచ్చింది’’ అని తెలిపారు.