Pawan Kalyan: ‘ఫేస్ బుక్’ ఖాతాను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- ‘ఫేస్ బుక్’లో పవన్ అధికారిక పేజీ ప్రారంభం
- యువతకు, ప్రజలకు మరింత చేరువవుతున్నాం
- నవంబర్ 2 న విజయవాడ - తునికి రైలులో పవన్ ప్రయాణం
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ లోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ‘ఫేస్ బుక్’ లో పవన్ తన అధికారిక పేజీని ప్రారంభించారు. ఈ మేరకు ‘జనసేన’ ఓ ప్రకటన విడుదల చేసింది. జనసైనికులు, యువతీయువకులు, ప్రజలకు మరింత చేరువవుతున్నారని, ఈ పేజీ ద్వారా పార్టీ సిద్ధాంతాలు, తన ఆలోచనలను పంచుకుంటారని, పార్టీ కార్యక్రమాలను కూడా తెలియజేస్తారని అన్నారు. ఈ పేజీలో తొలి పోస్ట్ గా తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు సంబంధించిన అప్ డేట్ పోస్ట్ చేశారని, నవంబర్ 2 వ తేదీన విజయవాడ నుంచి తుని పట్టణానికి రైలులో చేరుకుంటున్నట్లు తెలిపారని, అందులో భాగంగా కొన్ని స్టేషన్లలో వివిధ వర్గాల ప్రతినిధులను కలుసుకుంటారని పవన్ చెప్పినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది.
'సేనానితో రైలు ప్రయాణం'
జన్మభూమి రైలులో 'సేనానితో రైలు ప్రయాణం' పేరుతో పవన్ కల్యాణ్ ప్రయాణించనున్నారని జనసేన పార్టీ పేర్కొంది. ఈ ప్రయాణంలో పలు వర్గాల ప్రతినిధులు పవన్ కళ్యాణ్ తో మాట్లాడతారని పేర్కొంది. విజయవాడ నుంచి తుని చేరుకొనే వరకూ పలు వర్గాల ప్రజలతో మాటామంతీ ఉంటుందని, మధ్యాహ్నం 1.20 గంటలకు రైల్వే పోర్టర్లతో మాట్లాడతారని తెలిపింది. ఆ తర్వాత మామిడి రైతులు, అసంఘటిత రంగంలో ఉన్న చిరు వ్యాపారులు, రైల్వే వెండర్లతో పాటు, రైలులోని ప్రయాణికులు, చెరకు రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులు, ఏటికొప్పాక బొమ్మల తయారీ కళాకారులతో ఈ ప్రయాణంలో పవన్ మాట్లాడతారని పేర్కొంది.