Hyderabad: హైదరాబాద్‌ను వణికిస్తున్న చలి.. రేపటి నుంచి మరింత విజృంభణ
- నగరంలో తీవ్రంగా వీస్తున్న చలిగాలులు
- ఇబ్బందులు పడుతున్న చిన్నారులు, వృద్ధులు
- నవంబరు మొదటి వారం నుంచి మరింతగా పడిపోనున్న ఉష్ణోగ్రతలు
దీపావళి కూడా రాకుండానే హైదరాబాద్‌లో చలి వణికిస్తోంది. గత వారం రోజులుగా చలిగాలులు తీవ్రమయ్యాయి. పడిపోతున్న ఉష్ణోగ్రతలు నగరవాసులను వణికిస్తున్నాయి. రేపటి నుంచి శీతల గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రిపూట ఉష్ణోగ్రత సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్టు పేర్కొంది. మంగళవారం హైదరాబాద్‌లో గరిష్టంగా 31.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, 16.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
ఉదయం పూట చలి గాలులు తీవ్రంగా వీస్తుండడంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గత నాలుగు రోజులుగా వీటి తీవ్రత మరింత ఎక్కువైంది. ముఖ్యంగా చెట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉంది. చలికాలంలో సాధారణంగా 15-16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.