Andhra Pradesh: రైలు ప్రమాదాన్ని నివారించిన కూలీలకు నగదు బహుమతి, ప్రశంసాపత్రాలు!
- విరిగిన పట్టాను గుర్తించిన కూలి మల్లికార్జున
- మరో ముగ్గురి సాయంతో రైలు నిలిపివేత
- ఘనంగా సత్కరించిన రైల్వేశాఖ అధికారులు
రేణిగుంట-ఏర్పేడు స్టేషన్ల మధ్య రైలు ప్రమాదాన్ని నివారించిన ఓ కూలీ సహా నలుగురిని రైల్వే శాఖ సత్కరించింది. ఇక్కడి ఎద్దులచెరువు గ్రామానికి చెందిన మల్లికార్జున అనే రైతు కూలీ సోమవారం ఉదయం తిరుపతి - గూడూరు సెక్షన్ రేణిగుంట-ఏర్పేడు స్టేషన్ల మధ్య సాటి కూలీలను పిలవడానికి వెళుతున్నాడు. అంతలోనే రైలు పట్టాలు విరిగి ఉండటాన్ని గమనించాడు. మరోవైపు సికింద్రాబాద్ నుంచి తిరుపతి వైపు వస్తున్న ఓ రైలును గుర్తించాడు.
వెంటనే పక్కనే ఎర్ర టీ షర్టును ధరించిన వ్యక్తి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అతని టీషర్టును తీసుకుని రైలుకు ఎదురుగా పరిగెత్తాడు. దీంతో రైలును లోకో పైలెట్లు ఆపేశారు. ఈ సందర్భంగా సమయస్ఫూర్తితో వ్యవహరించిన కూలి మల్లికార్జునకు గుంతకల్ డీఆర్ఎం విజయ్ ప్రతాప్ సింగ్ రూ.10 వేలు నగదుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మల్లికార్జునకు సాయం చేసిన ముగ్గురు అధికారులకు రూ.2,500 చొప్పున నగదు సాయంతో ప్రశంసాపత్రాలను ఇచ్చారు. ఇంతకు మించి నగదును అందించే అధికారం లేకపోవడంతో తక్కువ నగదును ఇస్తున్నామని డీఆర్ఎం సింగ్ తెలిపారు. ఈ నలుగురు చాలా గొప్ప పనిచేశారనీ, వేలాది మంది ప్రాణాలను కాపాడారని వెల్లడించారు. ఈ సందర్భంగా నలుగురు కూలీలకు కృతజ్ఞతలు తెలిపారు.