Telangana: తెలంగాణకు బద్ధ శత్రువైన చంద్రబాబుతో కోదండరాం జతకట్టడం సిగ్గుచేటు!: ఓయూ జేఏసీ నేతలు
- తెలంగాణలో పెత్తనానికి ఆంధ్రా నేతల కుట్ర
- ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఖమ్మం జిల్లాది కీలకపాత్ర
- మహాకూటమి అభ్యర్థులకు బుద్ధి చెప్పాలి
తెలంగాణకు చంద్రబాబు బద్ధశత్రువని చెప్పిన ప్రొ.కోదండరాం ఇప్పుడు అదే చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకున్నారని ఉస్మానియా విశ్వవిద్యాలయం జేఏసీ(టీఆర్ఎస్) నేతలు ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నప్పటికీ ఆంధ్రా పాలకులు ఇక్కడ పెత్తనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా జేఏసీ చైర్మన్ పల్లపు ప్రవీణ్‌రెడ్డి, అధ్యక్షుడు బండారు వీరబాబు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కోదండరాం, చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటని నేతలు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఖమ్మం జిల్లా అంటే సీఎం కేసీఆర్ కు చాలా అభిమానమని తెలిపారు. అందుకే జిల్లాకు 3 కార్పొరేషన్లను సీఎం కేటాయించినట్లు వెల్లడించారు. తెలంగాణలో మహాకూటమికి బుద్ధి చెప్పాలనీ, జిల్లాలోని 10 సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తెలంగాణలో చంద్రబాబు, కోదండరాం ప్రచారానికి వస్తే తరిమితరిమి కొడతామని హెచ్చరించారు.