Karnataka: కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన హీరో అర్జున్.. తనపై కేసును కొట్టివేయాలని విజ్ఞప్తి!
- అర్జున్ పై ఫిర్యాదు చేసిన నటి శ్రుతి
- లైంగికంగా వేధించాడని ఆరోపణ
- హైకోర్టును ఆశ్రయించిన నటుడు
యాక్షన్ కింగ్, హీరో అర్జున్ సర్జా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. హీరోయిన్ శ్రుతి హరిహరన్ తనపై బెంగళూరులోని కబ్బన్ పార్కు పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసును కొట్టివేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ సందర్భంగా అర్జున్ తరఫు న్యాయవాది కోర్టులో వాదిస్తూ.. శ్రుతి హరిహరన్ అర్జున్ పై నిరాధార ఆరోపణలు చేసిందని తెలిపారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు అబద్ధాలన్నారు.
అర్జున్ గత 37 సంవత్సరాలుగా 150 సినిమాల్లో నటించారని తెలిపారు. అర్జున్ హనుమాన్ భక్తుడని, చెన్నైలో 32 అడుగుల పొడవు, 17 అడుగుల వెడల్పు ఉన్న ఆంజనేయుడి విగ్రహాన్ని నిర్మించారని వెల్లడించారు. శ్రుతి కేసుతో అర్జున్ కుటుంబం ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తోందనీ, వెంటనే ఈ కేసును కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు నటి శ్రుతిపై అర్జున్ దాఖలు చేసిన రూ.5 కోట్ల పరువునష్టం దావా కేసులో నిన్న వాదనలు ముగిశాయి. ఈ కేసులో మరికొంత సమయం కావాలని కోరడంతో న్యాయమూర్తి విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేశారు. కాగా, ఈ వ్యవహారంలో నటి శ్రుతికి రక్షణ కల్పించాలని కర్ణాటక మహిళా కమిషన్ బెంగళూరు పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ కు లేఖ రాసింది.
2015లో ద్విభాషా చిత్రం ‘విస్మయ’ షూటింగ్ సందర్భంగా అర్జున్ తనను అసభ్యంగా తాకుతూ వేధించాడనీ, మరో సందర్భంలో అసభ్యంగా మాట్లాడాడని శ్రుతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మొదలైన ‘మీ టూ’ ఉద్యమంలో భాగంగా అర్జున్ పేరును శ్రుతి బయటపెట్టింది.