gvl: ఏపీలో టీడీపీకి ఒక్క ఎంపీ సీటు రాదు: జీవీఎల్
- రాజకీయ ముసుగులో చంద్రబాబు అవినీతి
- సక్రమంగా పన్నులు కడితే టీడీపీ నేతలకు భయం ఎందుకు
- కడపలో జరిగిన ‘రన్ ఫర్ యూనిటీ’లో జీవీఎల్ వ్యాఖ్యలు
ఏపీలో టీడీపీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. ఐటీ సోదాలకు సీఎం రమేష్ బెంబేలెత్తిపోతున్నారని, టీడీపీ నేతలు సక్రమంగా పన్నులు కడితే భయం ఎందుకని ప్రశ్నించారు. రాజకీయ ముసుగులో చంద్రబాబు అవినీతికి తెరలేపారని ఆరోపించారు. దీక్షల పేరుతో ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు. చిత్తూరు జిల్లాలో మీటింగులు పెట్టడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించలేదని, ప్రభుత్వం సరైన రిపోర్ట్ ఇవ్వకపోవడం వల్లే కడప ఉక్కు పరిశ్రమ ఆలస్యం అవుతోందన్నారు.
ఇకనైనా చంద్రబాబు సొంత స్క్రిప్టులు రాసుకోవడం మానుకోవాలని సూచించారు. రెండో బ్రహ్మం శివాజీ చెప్పినట్లు చంద్రబాబు నడుచుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలేష్ యాదవ్ కేక వేస్తే చాలు చంద్రబాబు ఢిల్లీకి పరుగులు పెడుతున్నారని ఎద్దేవాచేశారు. ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కడప నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రన్ ఫర్ యూనిటీ’ని జీవీఎల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.