lagadapati rajagopal: డిసెంబర్ 7న మా సర్వే వివరాలు చెబుతాం: లగడపాటి రాజగోపాల్
- ప్రధాన పార్టీలేవైనా కోరితే ముందుగా సర్వే చేసి చెబుతా
- కాంగ్రెస్- టీడీపీ పొత్తు సక్సెస్ పై ప్రజలే చెప్పాలి
- ప్రతిపక్షపార్టీలను ఏకం చేయడం బాబుకు కొత్తేమి కాదు
సామాజిక మాధ్యమాల్లో తన పేరిట వస్తున్న ఎన్నికల సర్వేలు తనవి కాదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, డిసెంబర్ 7 తర్వాత తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తానని చెప్పారు. అయితే, ప్రధాన పార్టీలేవైనా కోరితే ముందుగానే సర్వే చేసి చెబుతానని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్- టీడీపీ పొత్తు ఏమేరకు సక్సెస్ అవుతుంది? అని విలేకరులు ప్రశ్నించగా, ఆ విషయాన్ని ప్రజలే చెప్పాలని సమాధానమిచ్చారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఏ రాష్ట్రంలోనూ నేరుగా ప్రత్యర్థులు కాదు కనుక, అందుకే, కలుస్తున్నారేమోనని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో నలభై ఏళ్ల అనుభవమున్న నాయకుడు చంద్రబాబు అని, గతంలోనూ ప్రతిపక్ష పార్టీలను ఆయన కలిపే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. ప్రతిపక్షపార్టీలను ఏకం చేయడం ఆయనకు కొత్తేమి కాదని అన్నారు.
ఈ సందర్భంగా లగడపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెదక్ లో పోటీ చేయాలని ప్రజలు తనను అడిగారని, అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచన తనకు లేదని, తెలంగాణలో పోటీ చేసే అవకాశం వస్తే కనుక లోక్ సభ ఎన్నికల్లో నిలబడతానని అన్నారు. ఆంధ్రా భావోద్వేగాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయనని చెప్పిన లగడపాటి, తన కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారని స్పష్టం చేశారు.