Pakistan: బిస్కెట్ ఆకారంలో ట్రోఫీ.. సోషల్ మీడియాలో జోకులు.. విచారణకు ఆదేశించిన పాక్
- పాక్-ఆసీస్ టీ20 సిరీస్ కోసం బిస్కెట్ ఆకారంలో ట్రోఫీ
- పీసీబీని ఆటాడుకున్న నెటిజన్లు
- అవమానంగా భావించి విచారణకు ఆదేశించిన బోర్డు
పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య జరగిన టీ20 సిరీస్ కోసం రూపొందించిన ‘బిస్కెట్ ట్రోఫీ’ పాకిస్థాన్ పరువును నవ్వుల పాలు చేసింది. పీసీబీ మార్కెటింగ్ చీఫ్ నలియా భాటి రాజీనామాకు దారితీసింది. బిస్కెట్ ఆకారంలో ఉన్న ఈ ట్రోఫీపై సోషల్ మీడియాలో జోకులు పేలుతుండడంతో అవమానంగా భావించిన పాక్ విచారణకు ఆదేశించింది. ఆస్ట్రేలియాతో దుబాయ్లో జరిగిన టీ20 సిరీస్లో పాక్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
అక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే సమస్యలు మొదలయ్యాయి. ఇందుకోసం రూపొందించిన ట్రోఫీ వివాదానికి కారణమైంది. మూడు వికెట్లపై పెద్ద బిస్కెట్ ఆకృతిలో ఉన్న ఈ ట్రోఫీపై సోషల్ మీడియాలో జోకులు పేలాయి. పీసీబీని నెటిజన్లు ఆటాడుకున్నారు. దీనికితోడు ఐసీసీ కూడా దానిని చాంపియన్స్ ట్రోఫీ నమూనాతో పోల్చింది. దీంతో అవమానంగా భావించిన పీసీబీ విచారణకు ఆదేశించింది. అసలు ఈ నమూనాను ఎలా అనుమతించారో తెలుసుకునేందుకు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో పీసీబీ మార్కెటింగ్ చీఫ్ నలియా రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.