Tirumala: ఇకపై ‘స్వచ్ఛ తిరుమల'.. శ్రీవారి సన్నిధిలో ప్లాస్టిక్ వినియోగం నిషేధం
- ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని బ్యాన్ చేసిన అధికారులు
- అతిక్రమిస్తే రూ.25వేల జరిమానా
- రెండోసారి అతిక్రమిస్తే షాపు లైలెన్స్ రద్దు
‘స్వచ్ఛ తిరుమల’ లక్ష్యాన్ని సాధించేందుకు టీటీడీ అధికారులు ప్లాస్టిక్‌పై నిషేధాన్ని విధించారు. గురువారం నుంచి తిరుమల కొండపై ఎవరూ ప్లాస్టిక్ కవర్లు వినియోగించరాదు, షాపుల యజమానులు కవర్లలో పెట్టి వస్తువులు అందించకూడదని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, అతిక్రమిస్తే 25 వేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని ప్రకటించారు.
తొలిసారి జరిమానాతో సరిపెడతామని, రెండోసారి తప్పుచేస్తే షాపు లైసెన్స్ రద్దు చేస్తామని అధికారులు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులు కూడా ఈ నిబంధన కచ్చితంగా అమలు చేసేలా వారిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
అలాగే భక్తుల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించేందుకు అన్నమయ్య భవనంలో ప్రతినెలా మొదటి శుక్రవారం ‘డయల్ యువర్ ఈఓ’ కార్యకమ్రం నిర్వహించనున్నారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య భక్తులు 0877-2263261 నంబర్‌కు ఫోన్ చేసి ఈఓతో మాట్లాడవచ్చు.