ali: 'యమలీల'లో తల్లి పాత్ర చేయడానికి కారణమదే: మంజు భార్గవి
- నా మొదటి ప్రాధాన్యత నాట్యానికే
- పాత్ర మనసుకు నచ్చితేనే చేస్తాను
- అందువల్లనే సినిమాల సంఖ్య తక్కువ
నృత్య కళాకారిణిగా .. నటిగా మంజుభార్గవి మంచి పేరు ప్రతిష్ఠలను సంపాదించుకున్నారు. 'శంకరాభరణం' .. 'యమలీల' చిత్రాలు ఆమె కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలు. ఆమె తన తొలి ప్రాధాన్యతను నాట్యానికి ఇవ్వడం వల్లనే సినిమాలు చాలా తక్కువగా చేశారు. అలాంటి మంజు భార్గవి తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, 'యమలీల'ను గురించి ప్రస్తావించారు.
"నేను చేసే పాత్రను గురించి ఒకటికి రెండు సార్లు విని .. బాగుంది అనుకుంటేనే చేసేదానిని. అలాంటిది ఒక రోజున కృష్ణారెడ్డిగారు మా ఇంటికి వచ్చారు. కథ చెప్పకుండానే 'యమలీల' సినిమాలో హీరోకి తల్లి పాత్రలో నేను నటిస్తేనే బాగుంటుందని అన్నారు. కథ విన్న తరువాత నాకు బాగా నచ్చేసింది. ఒక కొడుకు కోసం తల్లిపడే వేదన .. ఒక తల్లి కోసం కొడుకుపడే తాపత్రయం నచ్చడం వల్లనే ఆ సినిమా చేయడానికి అంగీకరించాను. అది నాకు బాగా సంతృప్తిని ఇచ్చిన పాత్ర" అని ఆమె చెప్పుకొచ్చారు.