Andhra Pradesh: గవర్నర్ ను కలుసుకున్న వైసీపీ నేతలు.. చంద్రబాబు, డీజీపీ ఠాకూర్ పై ఫిర్యాదు!
- కుట్ర కోణంలో సిట్ దర్యాప్తు జరగడం లేదు
- గవర్నర్ ఎవరికైనా ఫోన్ చేయొచ్చు
- మీడియాతో మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు
వైఎస్ జగన్ పై హత్యాయత్నం ఘటనలో కుట్ర కోణం దిశగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ సాగడం లేదని వైసీపీ నేతలు తెలిపారు. ఈ ఘటనపై థర్డ్ పార్టీతో విచారణ జరిపించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలుసుకున్న అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. జగన్ పై హత్యాయత్నం ఘటనపై డీజీపీకి గవర్నర్ ఫోన్ చేయగానే ముఖ్యమంత్రి దారుణంగా స్పందించారని విమర్శించారు. అసలు గవర్నర్ డీజీపీకి ఫోన్ చేయరాదని ఓ వితండవాదాన్ని అందుకున్నారని వెల్లడించారు. గవర్నర్ నియమించాకే ప్రభుత్వం, సీఎం ఉనికిలోకి వస్తారనీ.. ఈ విషయాన్ని మర్చిపోయిన టీడీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
జగన్ పై దాడి జరిగిన తర్వాత చోటుచేసుకున్న ఘటనలను గవర్నర్ నరసింహన్ కు వివరించినట్లు పేర్కొన్నారు. జగన్ ను కైమా.. కైమా చేసేవాళ్లమని ఓ టీడీపీ నేత హెచ్చరించారనీ, ఇలాంటి దారుణ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉందని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ పై హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తెలుసుకునే హక్కు రాష్ట్ర ప్రజలకు ఉందని స్పష్టం చేశారు. ఇప్పుడు సిట్ జరుపుతున్న విచారణ తప్పుదోవ పడుతోందని ఆరోపించారు.
అందువల్లే తాజాగా గవర్నర్ ను కలిసి సీఎం చంద్రబాబు, డీజీపీ ఆర్పీ ఠాకూర్ పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్రానికి సంబంధం లేని సంస్థతో విచారణ జరిపించాలని తాము గవర్నర్ ను కోరినట్లు వెల్లడించారు. అసలు గవర్నర్ డీజీపీకి ఎలా ఫోన్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించడంపై స్పందిస్తూ.. గవర్నర్ రాష్ట్రానికి రాజ్యాంగాధిపతి అని పేర్కొన్నారు.
గవర్నర్ తానంతట తానుగా నిర్ణయాలు తీసుకోలేరనీ, అయితే చట్టాలు, నిబంధనల ఉల్లంఘన జరిగితే ఆయన జోక్యం చేసుకుని నివేదిక కోరవచ్చని తెలిపారు. ‘ఈ చిన్న విషయం కూడా సీఎం చంద్రబాబుకు తెలియకపోవడం మా ఖర్మ’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.