Andhra Pradesh: ఆ శివాజీని ముందు అరెస్ట్ చేయండి.. జగన్ పై దాడి టైమ్ తెలుసుకాబట్టే అమెరికా పారిపోయాడు!: వైసీపీ నేత రోజా
- జగన్ చనిపోతే లాభం చంద్రబాబుకే
- ఆ రెస్టారెంటును లోకేశ్ ప్రారంభించారు
- ఆపరేషన్ గరుడ కుట్రదారుల్ని పట్టుకోండి
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసును నీరుగార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గం పనిచేస్తోందని వైసీపీ నాయకురాలు రోజా విమర్శించారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకోకముందే డీజీపీ ఠాకూర్ అభిమాని దాడి చేశాడని చెప్పడమే ఇందుకు నిదర్శనం అన్నారు. జగన్ ను అంతమొందించేందుకు భారీ స్కెచ్ వేశారనీ, దీని వెనుక భారీ లక్ష్యం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో పార్టీ నేతలతో కలిసి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలుసుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు.
ఒకవేళ ప్రతిపక్ష నేత జగన్ చనిపోతే అందరికంటే ఎక్కువ లాభం చంద్రబాబు నాయుడికేనని రోజా బాంబు పేల్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం అనంతరం తనకు రాజకీయంగా ఎదురులేదని భావించిన చంద్రబాబుకు జగన్ అడ్డుగోడలా నిలిచారని తెలిపారు. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని భుజాలపై మోసి జగన్ ను జైలులో పెట్టించారని వెల్లడించారు. ఇప్పటికీ 22 మంది ఎమ్మెల్యేలను కొని రాజకీయంగా తొక్కేయడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ కు వస్తున్న అశేష జనాదరణను చూసి తట్టుకోలేకే ఈ ఘాతుకానికి తెగబడ్డారని రోజా వ్యాఖ్యానించారు.
జగన్ పై మంత్రి సోమిరెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే వీరు మనుషులా? అన్న అనుమానం కలుగుతోందని తెలిపారు. నిందితుడు శ్రీనివాసరావు పనిచేస్తున్న రెస్టారెంట్ ను మంత్రి లోకేశ్ ప్రారంభించారని గుర్తుచేశారు. ఈ కత్తిని రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరి జనవరి నుంచి ఎందుకు దాచాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిందితులను అదుపులోకి తీసుకుని విచారించాలన్నారు. సినిమాలేని ఆర్టిస్టు చేసిన ‘ఆపరేషన్ గరుడ’ వాదనలను సీఎం సిగ్గులేకుండా వల్లిస్తున్నారని విమర్శించారు.
ఈ ఆరోపణలు చేసిన నటుడు ‘శివాజీ’ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. శివాజీని అరెస్ట్ చేసి ఈ ‘ఆపరేషన్ గరుడ’ వెనుక ఉన్న కేంద్రంలోని కుట్రదారులు, రాష్ట్రంలోని సూత్రధారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ గరుడ ఎప్పుడు జరుగుతుందో టైమ్ తెలుసు కాబట్టే శివాజీ అమెరికాకు పారిపోయి దాక్కున్నాడని ఆరోపించారు. శివాజీపై చర్యలు తీసుకుని దోషులను పట్టుకోకుంటే వైసీపీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు ఊరుకోబోరని హెచ్చరించారు.