Andhra Pradesh: ఆంధ్రాలో 60 లక్షల ఓట్లను తొలగించారు.. ఒక్క కడపలోనే 4 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి!: వైసీపీ నేత అంబటి
- సర్వేల పేరుతో ఈ కుట్ర సాగుతోంది
- వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులే టార్గెట్
- ప్రజలు ఓట్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తొలగించే కార్యక్రమం యథేచ్ఛగా సాగుతోందని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. పల్స్ సర్వే, రియల్ టైమ్ గవర్నెన్స్ పేరుతో ప్రజలకు ఫోన్ కాల్స్ వస్తున్నాయనీ, ప్రభుత్వ పాలన బాగోలేదని బటన్ నొక్కితే వారి ఓట్లు గల్లంతు అవుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో భారీగా నకిలీ ఓటర్లను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు అమరావతిలో వైసీపీ నేతలతో ఎన్నికల అధికారి సిసోడియాను కలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ 60 లక్షల ఓట్లను ప్రభుత్వం తొలగించిందని అంబటి రాంబాబు తెలిపారు. వీటిలో కడపలో 4.90 లక్షల ఓట్లు, కర్నూలులో 6.31 లక్షల ఓట్లు, చిత్తూరులో 4 లక్షల ఓట్లను తొలగించారని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని స్వస్థలం సత్తెనపల్లిలో తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఓట్లు సైతం గల్లంతు అయ్యాయని విస్మయం వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి సిసోడియా దృష్టికి తీసుకెళ్లామని అంబటి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 40 లక్షల వరకూ నకిలీ ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. ఎన్నికల గిమ్మిక్కులు చేయడంలో చంద్రబాబు ఉద్ధండుడనీ, ప్రజలు జాగ్రత్తగా ఓటును కాపాడుకోవాలని సూచించారు.