Kodandaram: టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే లబ్ధి: కోదండరాం
- కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేకి
- కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం పెంపు
- ప్రభుత్వం ఖర్చులో ప్రజలకు వాటా ఉండాలి
కమీషన్ల కోసం ఆశపడి రూ.40 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80 వేల కోట్లకు పెంచారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆ రూ.40 వేల కోట్లు బడ్జెట్లో మిగిలి ఉంటే డబులు బెడ్రూం ఇళ్లు పూర్తయి ఉండేవన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసాలో ప్రజలకు వాటా ఉండాలన్నారు. ప్రజల బాగోగుల గురించి కేసీఆర్ ఆలోచించలేదన్నారు.
కంటి, పంటి చికిత్స కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని పేర్కొన్న ఆయన, మరి వైద్యం కోసం పేదలు ఎక్కడకు వెళ్లాలని ప్రశ్నించారు. కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేకిగా మారారని, ఆయన ఇచ్చిన హామీలు నెరవేరలేదని విమర్శించారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో కోదండరాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.