Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయానికి వచ్చిన స్థానాలు.. లీకైన జాబితా ఇదిగో!
- 57 స్థానాలపై కాంగ్రెస్ ఏకాభ్రిప్రాయం
- 8-9 తేదీల్లో తుది జాబితా విడుదల
- మిగతా స్థానాలపై కుస్తీ
తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ 95 స్థానాల్లో బరిలోకి దిగాలని నిర్ణయించింది. టీడీపీకి 14, మిత్రపక్షాలైన టీజేఎస్, సీపీఐలకు చెరో ఐదు స్థానాలు కేటాయించాలని నిర్ణయానికి వచ్చింది. కాంగ్రెస్ పోటీ చేయాలని భావిస్తున్న 95 స్థానాలకు గాను 57 స్థానాల్లో బరిలోకి దింపనున్న అభ్యర్థులపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. వీరిలో 14 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.
మీడియాలో హల్చల్ చేస్తున్న దాని ప్రకారం.. కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, మంథని నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి నుంచి విజయరమణారావు, సిరిసిల్ల నుంచి కేకే మహేందర్‌రెడ్డి, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్, కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ, బోధన్ నుంచి సుదర్శన్‌రెడ్డి, బాన్సువాడ నుంచి కాసు బాలరాజు, నిర్మల్ నుంచి మహేశ్వర్‌రెడ్డి, ఆసిఫాబాద్ నుంచి ఆత్రం సక్కు, పినపాక నుంచి రేగ కాంతారావు, ములుగు నుంచి సీతక్క, పాలకుర్తి నుంచి జంగా రాఘవరెడ్డి పోటీ చేస్తారు.
ఇక భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య, ఆలేరు నుంచి బూడిద భిక్షమయ్యగౌడ్, సనత్‌నగర్ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి, గోషామహల్ నుంచి ముఖేశ్ గౌడ్, జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్ధన్‌రెడ్డి, ముషీరాబాద్ నుంచి అనిల్ యాదవ్, అచ్చంపేట నుంచి డాక్టర్ వంశీకృష్ణ, జడ్చర్ల నుంచి మల్లు రవి, షాద్‌నగర్ నుంచి ప్రతాప్‌రెడ్డి పోటీ పడతారు.
ఇంకా మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, గజ్వేల్ నుంచి వంటేరు ప్రతాప్‌రెడ్డి, నర్సాపూర్ నుంచి సునీతాలక్ష్మారెడ్డి, ఆందోల్ నుంచి దామోదర రాజనరసింహ, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, సిద్ధిపేట నుంచి దరిపెల్లి చంద్రం బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానాల విషయంలో కాంగ్రెస్ పెద్దలు ఏకాభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం. మిగతా స్థానాలపైనా ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఈనెల 8, 9 తేదీల్లో తుది జాబితా ప్రకటించనున్నారు.