Janmabhoomi: అటు జన్మభూమి, ఇటు జనసేనాని... విజయవాడలో అప్పుడే మొదలైన సందడి!
- నేడు 'జనసేనానితో రైలు ప్రయాణం'
- స్టేషన్ కు భారీగా చేరుకుంటున్న ఫ్యాన్స్
- పలు వర్గాలతో సమావేశం కానున్న పవన్
నేడు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, విజయవాడ నుంచి తుని వరకూ రైలు యాత్ర చేయనుండగా, మధ్యాహ్నం 1.20 గంటలకు రైలు బయలుదేరనుంది. ఇప్పటికే విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద పవన్ అభిమానులు సందడి ప్రారంభించారు. 'జనసేనానితో రైలు ప్రయాణం' పేరిట యాత్ర సాగనుండగా, పలు వర్గాల ప్రజలతో పవన్ మాట్లాడనున్నారు.
విజయవాడ స్టేషన్ లో రైల్వే పోర్టర్లు, నూజివీడులో మామిడి రైతులతో మాట్లాడనున్న ఆయన, ఏలూరులో అసంఘటిత కార్మికులు, సాధారణ ప్రయాణికులను కలవనున్నారు. ఆపై తాడేపల్లిగూడెంలో చెరకు రైతులతో, రాజమండ్రిలో టెక్స్ టైల్ కార్మికులతో రైల్లోనే సమావేశం అవుతారు. సామర్లకోటలో విద్యార్థులతో, అన్నవరంలో ఏటికొప్పాక బొమ్మల తయారీ కార్మికులతో మాట్లాడతారు.
ఈ రైలుయాత్రకు అభిమానులు రావద్దని జనసేన చెబుతున్నప్పటికీ, భారీ సంఖ్యలో స్టేషన్ కు చేరుకుంటున్న అభిమానులు, ఇప్పటి నుంచే నినాదాలు మొదలు పెట్టారు. 24 గంటల ముందు నుంచే ఎక్కాల్సిన రైలు టికెట్ తీసుకునే సౌలభ్యం ఉండటంతో, పలువురు పవన్ తో కలసి రైలులో ప్రయాణించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5.10 గంటల వరకూ యాత్ర సాగనుంది. ఆపై తునిలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు.