sathara: నెటిజన్ల మనసు గెల్చుకున్న చిట్టితల్లి.. ఆపన్న హస్తం అందించిన పలువురు!

  • పుట్టగానే తల్లిని కోల్పోయిన చిన్నారి
  • కొన్నాళ్లకు తండ్రి కూడా దూరం
  • శారీరక సమస్యకు చికిత్స కోసం ఎదురు చూపు

ఆమె నవ్వు నెటిజన్లను కట్టిపడేసింది...ఆత్మస్థైర్యం అచ్చెరువొందించింది. చిన్నారి ఎదుర్కొంటున్న సమస్య తెలుసుకుని వారి హృదయం భారమైంది. అందుకే పెద్ద మనసుతో స్పందించారు. లక్షలు సమకూర్చారు. చిట్టితల్లి కష్టం తీర్చేందుకు సిద్ధమయ్యారు. సామాజిక మాధ్యమాలతో చెడే కాదు, మంచి కూడా జరుగుతుందని ఈ సంఘటన నిరూపించింది.

వివరాల్లోకి వెళితే...మహారాష్ట్రలోని సతారాకు చెందిన ఆరుషి పుట్టగానే తల్లి చనిపోయింది. మరో ఇరవై రోజులకు తండ్రి కూడా కాలం చేశాడు. నిరుపేదలైన బామ్మ, తాతయ్యే ఆ చిన్నారికి దిక్కయ్యారు. అయితే ఏడాది వయసు వచ్చేసరికి ఆరుషి కాన్‌జెన్సియల్‌ సుడత్రాసిస్‌ (కాలి ఎముక వంగిపోవడం) సమస్య బారిన పడింది. అందరి పిల్లల్లాగా అరుషి నడవాలంటే ఆపరేషన్‌ అవసరం అని, ఇందుకు రూ.16 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు తెలిపారు. అసలే కొడుకు, కోడలిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆ వృద్ధులకు ఈ వార్త షాకయింది.

రోజు గడిచేందుకే పోరాడుతున్న తాము అంతమొత్తం ఎలా సమకూర్చగలమని కన్నీటిపర్యంతమయ్యారు. వీరి కన్నీటి గాథను తెలుసుకున్న ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ అనే స్వచ్ఛంద సంస్థ ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వచ్చింది. చిన్నారి దీన గాథను ఫొటోతో సహా ఫేస్‌బుక్‌లో పోస్టుచేసి ఫండ్‌ రైజింగ్‌ క్యాంపెయిన్‌ చేపట్టింది. కాలికి పింక్‌ బ్యాండేజీతో ఉన్న చిన్నారి ఆరుషి హృద్యంగా నవ్వుతున్న ఫొటో నెటిజన్లను కట్టిపడేసింది. ఆరు గంటల్లోనే ఆరుషి ఆపరేషన్‌కు అవసరమైన రూ.16 లక్షలు సమకూర్చేందుకు 980 మంది నెటిజన్లు ముందుకు రావడం విశేషం.

  • Loading...

More Telugu News