Venkaiah Naidu: నోట్ల రద్దుతో దీర్ఘకాలిక ప్రయోజనాలు: ఉపరాష్ట్రపతి
- బోట్స్వానా వెళ్లిన వెంకయ్యనాయుడు
- నల్లధనాన్ని సులభంగా గుర్తించవచ్చు
- పన్ను చెల్లింపుదారుల సంఖ్య భారీగా పెరిగింది
నోట్ల రద్దు వల్ల తాత్కాలిక ఇబ్బందులున్నా.. దీర్ఘకాలిక ప్రయోజనాలుంటాయని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అధికారిక పర్యటన నిమిత్తం బోట్స్వానా వెళ్లిన ఆయన అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. నోట్ల రద్దుతో ఇబ్బందులున్నా.. అది ప్రజల మంచి కోసమే జరిగిందన్నారు.
దీని కారణంగా పడకగది, స్నానాల గది, దిండు కింద దాచిన సొమ్మంతా బ్యాంకులకు చేరిందన్నారు. దీనివల్ల నల్లధనాన్ని సులభంగా గుర్తించవచ్చన్నారు. జీఎస్టీ ద్వారా పన్ను చెల్లింపుదారుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. సులభతర వ్యాపారం జరుగుతోందని, మార్కెట్లు మరింత పారదర్శకంగా మారుతున్నాయన్నారు. ప్రస్తుతం దేశంలో 6.8 కోట్ల మంది పన్ను చెల్లిస్తున్నారని వెంకయ్యనాయుడు తెలిపారు.