CEBI: సత్యం రామలింగరాజుపై 14 ఏళ్ల నిషేధం.. రూ.813 కోట్లను వడ్డీతో చెల్లించాల్సిందే: సెబీ
- ‘సత్యం’ కుంభకోణంలో సెబీ సంచలన ఆదేశాలు
- 45 రోజుల్లోగా సొమ్మును డిపాజిట్ చేయాలని ఆదేశం
- 2014 నుంచి అమల్లోకి రానున్న నిషేధ కాలం
‘సత్యం’ కుంభకోణంలో రామలింగరాజుకు సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజి బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) మరోమారు షాకిచ్చింది. సెక్యూరిటీస్ మార్కెట్లో మరో 14 ఏళ్లపాటు కార్యకలాపాలు నిర్వహించడానికి వీల్లేదని, అక్రమంగా సంపాదించిన రూ.813.40 కోట్లను వడ్డీతో కలిపి చెల్లించాలంటూ శుక్రవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. రామలింగరాజు సోదరులు బి.రామరాజు, బి.సూర్యనారాయణరాజు, ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్‌లకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. అయితే, నిషేధం విధించిన 14 ఏళ్లలో ఇప్పటికే పూర్తయిన కాలం కూడా ఉంటుందని సెబీ స్పష్టం చేసింది. గతంలో రూ.1,258.88 కోట్లను చట్ట వ్యతిరేకంగా సంపాదించారని పేర్కొన్న సెబీ ఇప్పుడు దానిని రూ.813.40 కోట్లకు తగ్గించడం గమనార్హం.
సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడైన బి.రామలింగరాజు, బి.రామరాజులకు 15 జూలై 2014 నుంచి సెక్యూరిటీ మార్కెట్ నుంచి నిషేధం మొదలైంది. కాబట్టి సెబీ తాజా ఆదేశాలు అప్పటి నుంచి వర్తిస్తాయి. అంటే అప్పటి నుంచి 14 ఏళ్ల కాలాన్ని లెక్కిస్తారు. సూర్యనారాయణరాజు, ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్‌పై నిషేధం 10 సెప్టెంబరు 2015 నుంచి అమల్లోకి వచ్చింది. తాజా ఆదేశాలు వీరికి అప్పటి నుంచి వర్తిస్తాయి.
సెబీ ఆదేశాల ప్రకారం.. ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ రూ.675.39 కోట్లు, సూర్యనారాయణ రాజు రూ.81.84 కోట్లు, రామరాజు రూ.29.54 కోట్లు, రామలింగరాజు రూ.26.62 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి వడ్డీ అదనం. అంతేకాదు.. 45 రోజుల్లోగా ఈ సొమ్మును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.