Andhra Pradesh: ఏపీ కరవుతో అల్లాడుతోంది.. ప్రకాశం జిల్లా బాగుపడాలంటే ‘వెలిగొండ’ పూర్తికావాల్సిందే!: వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి

  • వైఎస్ హయాంలోనే 65 శాతం పనులు పూర్తి
  • మిగిలిన పని పూర్తిచేసేందుకు టీడీపీ, కాంగ్రెస్ అష్టకష్టాలు
  • బాబును సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలు బాగుపడాలంటే వెలిగొండ ప్రాజెక్టు పూర్తికావాలని మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి భావించినట్లు వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైఎస్ హయాంలో ప్రాజెక్టు పనులు 65 శాతం పూర్తి అయ్యాయని వెల్లడించారు. ఆయన తర్వాత వచ్చిన కాంగ్రెస్, టీడీపీలు 35 శాతం పనులను పూర్తి చేయడానికి నానాకష్టాలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడారు.

చంద్రబాబు ఇప్పటివరకూ ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును నాలుగుసార్లు సందర్శించారనీ, ఆయన ప్రకటనలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. ధర్మపోరాట దీక్ష అంటూ చంద్రబాబు అధర్మపోరాట దీక్ష చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు కరువుతో అల్లాడిపోతున్నారని వ్యాఖ్యానించారు.

వెలిగొండ ప్రాజెక్టులో కాంట్రాక్టర్లను మార్చేసిన బాబు రూ.270 కోట్లతో పూర్తయ్యే పనుల అంచనాలను రూ.570 కోట్లకు తీసుకెళ్లారని ఆరోపించారు. తాజాగా నిన్న ప్రకాశం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు వచ్చే సంక్రాంతికల్లా వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తామని కబుర్లు చెబుతున్నారన్నారు. మరో నాలుగేళ్లు అయినా టీడీపీ ప్రభుత్వ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తికాదన్నారు.

చంద్రబాబును సాగనంపేందుకు ప్రకాశం జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టుకు తొలి ప్రాధాన్యం ఇచ్చి పూర్తిచేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కలవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించబోతోందని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News