yanamala ramakrishnudu: నిరంకుశ, పెత్తందారీ విధానాలపై పోరాటం టీడీపీ విధానం: మంత్రి యనమల
- మోదీ పాలనలో ఇవి ఉన్నాయి కాబట్టే వ్యతిరేకిస్తున్నాం
- ఏ పార్టీకీ టీడీపీ వ్యతిరేకం కాదు...విధానాలకు వ్యతిరేకం
- ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి కంటే నేడు పరిస్థితులు అధ్వానం
తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క పార్టీకో వ్యతిరేకం కాదని, నిరంకుశ, పెత్తందారీ విధానాలకు మాత్రమే వ్యతిరేకమని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కొందరు టీడీపీ భావజాలానికి వక్రభాష్యం చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అమరావతిలో శుక్రవారం ఆయన మాట్లాడారు.
అహంభావం, నిరంకుశత్వం, పెత్తందారీ విధానాలు ఏ పార్టీలో ఉన్నా అ పార్టీలను వ్యతిరేకిస్తామని, ప్రస్తుతం కేంద్రంలో మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వంలో ఈ విధానాలు ఉన్నందునే ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి కంటే నేడు బీజేపీ పాలనలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని చెప్పారు.
వ్యవస్థలన్నింటినీ మింగేసిన అనకొండ మోదీ అని, అటువంటి మోదీ రక్షకుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఈ విషయం ఏపీ బీజేపీ నేతలు తెలుసుకోవాలని సూచించారు. వైసీపీ, జనసేన కలిసికట్టుగా టీడీపీని విమర్శించడం బాధ్యతారాహిత్యమన్నారు.