Chennai: 'ఈ సినిమా చేయలేను, నన్ను వదిలేయాలని' శంకర్ కు చెప్పినా వినలేదు!: రజనీకాంత్
- చెన్నై, సత్యం థియేటర్ లో '2.ఓ' ట్రైలర్ విడుదల వేడుక
- అనారోగ్యంతో కొన్ని సీన్లకు 10 టేకులు తీసుకున్నా
- వచ్చి నిలబడితే చాలని శంకర్ అన్నారు
- ఈ సినిమా సూపర్ హిట్టేనన్న రజనీకాంత్
రజనీకాంత్ అభిమానులతో పాటు ప్రపంచ సినీ ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న '2.ఓ' సినిమా ట్రయిలర్ వచ్చేసింది. చెన్నైలోని సత్యం థియేటర్ లో ట్రైలర్ విడుదల వేడుక వైభవంగా జరుగగా, రజనీ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనడంలో సందేహం లేదన్నారు.
సినిమాను ప్రారంభించిన సమయంలో అనారోగ్యానికి గురయ్యానని, 12 కిలోల బరువైన బాడీకోట్ వేసుకుని నటించలేనని అనిపించి, అదే విషయాన్ని దర్శకుడు శంకర్ కు చెప్పానని అన్నారు. కొన్ని సీన్లకు 8 నుంచి 10 టేకులు తీసుకున్నానని గుర్తు చేసుకున్న రజనీ, ఆ సమయంలో తనకు నమ్మకం పోయిందని, "సినిమా నుంచి తప్పుకుంటా. నన్ను వదిలేయండి. న్యాయం చేయలేకపోతున్నా" అని శంకర్ కు చెప్పానని అన్నారు.
దానికి శంకర్ ససేమిరా అన్నాడని, ఆ బాడీ కోట్ ను తీసేస్తానని, స్పాట్ కు వచ్చి నిలబడితే చాలునని అన్నాడని రజనీ చెప్పారు. తాను మాత్రం నటిస్తే, బాడీసూట్ తోనే నటిస్తానని చెప్పానని తెలిపారు. ఢిల్లీ షెడ్యూల్ తరువాత నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే, అదే విషయాన్ని నిర్మాత సుభాస్కరన్ కు చెప్పానని, ఆయన నాలుగు సంవత్సరాలైనా సరే వేచి చూస్తామని చెప్పారని అన్నారు.
శంకర్, రాజ్ కుమార్ హిరాణి, రాజమౌళి వంటి దర్శక ఆణిముత్యాలను మనం కాపాడుకోవాల్సి వుందన్నారు. శంకర్ తదుపరి 'భారతీయుడు-2' తీస్తున్నారని గుర్తు చేసిన రజనీ, ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని తాను ఇప్పుడే చెప్పగలనని అన్నారు.