bride: కట్నం కోసం అత్తింటి వేధింపులు.. ఇంట్లో చెప్పలేక ప్రాణాలు తీసుకున్న నవవధువు!
- జగిత్యాల జిల్లా రాయికల్ లో ఘటన
- మిగిలిన కట్నం తీసుకురావాలని డిమాండ్
- తల్లిదండ్రులను అడగలేక యువతి బలవన్మరణం
కట్నం వేధింపులు ఓ నిండు ప్రాణాన్ని బలికొన్నాయి. కట్నం తీసుకురావాలని అత్తింటివారి వేధింపులు ఓవైపు, కుటుంబ సభ్యుల ఇబ్బందులు వెరసి సదరు యువతి మనస్తాపానికి లోనైంది. చివరికి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా రాయికల్ లో చోటుచేసుకుంది.
జిల్లాలోని రాయికల్ కు చెందిన కృష్ణవేణి(22)కి ధర్మపురికి చెందిన శనిగారపు రాకేశ్‌తో ఈ ఏడాది ఆగస్టులో వివాహం అయింది. రాకేశ్ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అయితే వివాహ సమయంలో రూ.15 లక్షల కట్నం ఇస్తామన్న అమ్మాయి కుటుంబ సభ్యులు తొలివిడతగా రూ.10 లక్షలు అందించారు. ఈ క్రమంలో మిగిలిన కట్నాన్ని కూడా తీసుకురావాలని కృష్ణవేణిని అత్తింటివారు వేధించడం మొదలుపెట్టారు.
దీంతో బతుకమ్మ పండుగ సందర్భంగా కృష్ణవేణి పుట్టింటికి వచ్చింది. కుటుంబ సభ్యుల పరిస్థితిని చూసి కట్నం విషయాన్ని చెప్పలేకపోయింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆవేదనకు లోనైన బాధితురాలు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. కుమార్తె చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.