Andhra Pradesh: అన్నయ్యని ఎదిరించానని చెప్పే పవన్, మోదీని ఎందుకు ఎదిరించడం లేదు?: బుద్ధా వెంకన్న
- లోకేశ్ అద్భుతంగా పనిచేస్తున్నారు
- ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు ఆయన ఘనతే
- సంక్షేమ నిధితో కార్యకర్తలను ఆదుకున్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా అసెంబ్లీలో స్పీకర్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ ను పక్కన పెట్టుకుని జనసేన అధినేత పవన్ ఏపీ సీఎం చంద్రబాబును విమర్శించడం దారుణమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ‘అన్నయ్య చిరంజీవిని ఎదిరించాను’ అంటూ మాటిమాటికి చెప్పే పవన్ ప్రధాని మోదీని ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. ఈ రోజు విజయవాడలో టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నరేంద్ర మోదీ మోసాలను ధైర్యంగా ఎదుర్కొని నిలిచిన నేత చంద్రబాబు అని కితాబిచ్చారు. మోదీని ప్రశ్నించే ధైర్యం లేని పవన్ కల్యాణ్ తమ నాయకుడిని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండానే లోకేశ్ మంత్రి అయ్యారంటూ పవన్ చేస్తున్న విమర్శలపై వెంకన్న ఘాటుగా స్పందించారు. అసలు ఎన్నికల్లో ఇప్పటివరకూ పోటీ చేయని పవన్ కల్యాణ్ సీఎం ఎలా అవుతారని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీగా ఉన్న లోకేశ్ చొరవ కారణంగా రాష్ట్రమంతటా పల్లెల్లో సీసీరోడ్లు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి పేరుతో వేలాది మందిని లోకేశ్ ఆదుకున్నారనీ, చివరికి జనసేన కార్యకర్తలను సైతం చంద్రన్న బీమా కింద ఆదుకున్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు.