Telangana: శేరిలింగంపల్లి టికెట్ నాకే ఇవ్వాలి.. గాంధీభవన్ ముందు ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే భిక్షపతి!
- 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను
- బీసీ కావడంతోనే నాకు అన్యాయం జరుగుతోంది
- చంద్రబాబు తన నిర్ణయంపై పునరాలోచించాలి
ఇప్పటివరకూ ప్రజల ముఖాలను చూడనివారిని టీడీపీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పోటీకి దించుతోందని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత భిక్షపతి యాదవ్ విమర్శించారు. తాను గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాననీ, పార్టీలు ఏనాడూ మారలేదని తెలిపారు. బీసీ నేత కావడంతోనే తనకు అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు భిక్షపతి యాదవ్ ధర్నాకు దిగారు. శేరిలింగంపల్లి టికెట్ ను ఈసారి తనకే కేటాయించాలని కోరుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నుంచి ఎవరు పోటీ చేయాలన్న విషయం ఇంకా ఖరారు కాలేదని భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు సిమెంట్ వ్యాపారి వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ ను పోటీ చేయకుండా నిలువరించాలని సూచించారు. టీడీపీకి శేరిలింగంపల్లిలో కేడర్ లేదనీ, అయినా పోటీ చేస్తే టీఆర్ఎస్ విజయం నల్లేరుపై నడకలా మారుతుందని హెచ్చరించారు. నియోజకవర్గంలో మంచిపట్టున్న తనకు శేరిలింగంపల్లి టికెట్ ను కేటాయించాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరారు.