Telugudesam: టీడీపీ-కాంగ్రెస్ పార్టీ కలయిక 420-840 లాంటిది : వైసీపీ నేత బొత్స
- టీడీపీని కాపాడుకునేందుకే ‘కాంగ్రెస్’తో కలిశారా?
- ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేకనే ఆ పార్టీతో కలిశారా?
- నాలుగేళ్ల టీడీపీ పాలనపై మీకే నమ్మకం లేదు
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. విశాఖపట్టణంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'టీడీపీ-కాంగ్రెస్ పార్టీ కలయిక 420-840 లాంటిది. టీడీపీని కాపాడుకునేందుకే ‘కాంగ్రెస్’తో కలిశారా? సుజనా చౌదరిపై ఈడీ, సీఎం రమేష్ పై ఐటీ దాడులు జరిగాయి. మరి తనను, తన పార్టీ నేతలను కాపాడుకునేందుకేనా ఈ కలయికా? నాలుగేళ్ల టీడీపీ పాలనపై మీకే నమ్మకం లేదు. ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేకనే కాంగ్రెస్ పార్టీతో కలిశారా?' అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
సీబీఐ అంటే ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అని ఒకప్పుడు విమర్శలు చేసి, ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? అని ప్రశ్నించారు. వ్యవస్థను చంద్రబాబు నాశనం చేస్తున్నారనడంలో సందేహం లేదని, నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశారో స్పష్టం చేయాలని కోరారు. చంద్రబాబు అక్రమాలకు, మోసాలకు మూల్యం చెల్లించకతప్పదని, సీట్ల కోసం చంద్రబాబుతో కలిసొస్తున్న పార్టీలు, ఆయన చేసిన అక్రమాలపై ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు.
వైసీపీది ఒకటే ధ్యేయం, ఒకటే ఆలోచన అని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పుట్టిన పార్టీ వైసీపీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకున్న పార్టీ వైసీపీ అని, ఏపీకి ప్రత్యేకహోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్నది తామేనని, రాష్ట్ర ప్రజల శ్రేయస్సే తమకు ముఖ్యమని బొత్స అన్నారు.