Telangana: టీఆర్ఎస్-బీజేపీలు కచ్చితంగా కలుస్తాయి.. నేను సీఎం రేసులో లేను!: కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి
- టీఆర్ఎస్ కు సగం సీట్లు కూడా రావు
- బీజేపీ, ఎంఐఎంతో జతకట్టాల్సి రావచ్చు
- ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ కు 50 శాతం సీట్లు కూడా రావని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తెలిపారు. కాబట్టి టీఆర్ఎస్ బీజేపీతో 100 శాతం జట్టు కడుతుందని జోస్యం చెప్పారు. మోదీతో కూడా కేసీఆర్ కు మంచి అవగాహన ఉందని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు టీఆర్ఎస్-బీజేపీ పార్టీలు జతకడతాయని స్పష్టం చేశారు. ఓ మీడియా సంస్థకు ఈ రోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైపాల్ రెడ్డి మాట్లాడారు.
డిసెంబర్ 7న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 6-7 సీట్లు గెలుచుకోవచ్చని తెలిపారు. ఇదే జరిగితే కేసీఆర్ బీజేపీతో పాటు ఏఐఎంఐఎంతో చర్చలు జరుపుతారని వెల్లడించారు. ఒకవేళ కేసీఆర్ బీజేపీతో ముందుకు వెళ్లాలని నిర్ణయిస్తే ఎంఐఎం పరిస్థితి దారుణంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. కానీ ఇదంతా జరగబోదనీ, ఎందుకంటే ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మహాకూటమి ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ చాలా ఆందోళనకు గురవుతున్నారని జైపాల్ రెడ్డి అన్నారు. తాను ముఖ్యమంత్రి రేసులోనే లేననీ, ఇక ముందు వరుసలో ఎలా ఉంటానని ప్రశ్నించారు. ఆరోగ్యరీత్యా తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.