Telangana: ప్రజలకిచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదు: మహారాష్ట్ర మాజీ సీఎం చౌహాన్
- ఇప్పుడు కొత్త హామీలను ఎలా ఇస్తారు?
- తెలంగాణను టీఆర్ఎస్ నేతలు అప్పులపాలు చేశారు?
- మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఏమైంది?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ విమర్శలు చేశారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్, ఇప్పుడు కొత్త హామీలను ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
హామీల అమలుపై కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు నిలదీయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ నేతలు అప్పులపాలు చేశారని, ఎస్సీలకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అంశంలో, ఉద్యోగాల భర్తీ విషయంలోనూ టీఆర్ఎస్ నేతలు విఫలమయ్యారని అన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైంది? అని ప్రశ్నించిన చౌహాన్, టీఆర్ఎస్ మంత్రి వర్గంలో మహిళలకు ప్రాధాన్యమివ్వలేదని ఆరోపించారు.